విశాఖ ఉక్కు ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, దీక్షలు నిర్వహిస్తూ మహాసముద్రంలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గత వారం రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజు ఉదయం దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
పల్లా శ్రీనివాసరావు దీక్షకు మద్దతు తెలిపేందుకు స్వయంగా తానే దీక్షా స్థలానికి వస్తానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ముందుగానే పోలీసులు భగ్నం చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. అయినప్పటికీ పోలీసుల ప్రయత్నమే ఫలించింది. అయితే… తాను ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. దాంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనన్న ఉద్దేశంతో పోలీసులు ముందుగానే పల్లాను దీక్షా స్థలి నుంచి తరలించారు.
విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది అన్నట్లుంది. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్ ప్లాంట్‌పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా.. నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానిలో కార్మిక సంఘాలు జాయిన్ అవ్వడంతో వైసీపీ నేతలు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడుతున్నారని, స్టీల్‌ప్లాంట్ మీద చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుతున్నారు.