వైసిపి నేత, మాజీ ఎంఎల్ఏ సిరియా సాయిరాజ్ పై పోలీసులు కేసు నయోదు చేశారు. తిత్లీ తుపాను బాధితులకు సహాయం అందటం లేదనే కారణంతో సాయిరాజ్ ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సహాయ పునరావాస కార్యక్రమాలపై మాజీ ఎంఎల్ఏ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. తహశిల్దార్ కార్యాలయం ముందు సాయిరాజ్ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వంపై నిరసన తెలిపినందుకు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ మాజీ ఎంఎల్ఏపై 309, 341, 353 సెక్షన్ల క్రింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
సాయిరాజ్ ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. గడచిన నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వ విధానాలపై సాయిరాజ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకనే ప్రభుత్వం సాయిరాజ్ పై గురిపెట్టింది. లేకపోతే తుపాను సహాయం అందటం లేదని ఆందోళన నిర్వహిస్తే అన్ని సెక్షన్ల క్రింద కేసులు పెడతారా ? పైగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టటం ఆశ్చర్యంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టటంపై నేతలు మండిపడుతున్నారు.
ఇదే కాకుండా గడచిన మూడు రోజులుగా పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి తుపాను బాధితుల్లో చాలామందికి సహాయం అందటం లేదు. అందుకని ఎక్కడికక్కడ బాధితులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు ముందు కూడా గడచిన నాలుగురోజులుగా ఆందోళనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆందోళనలనగానే పోలీసులు బాధితులను పోలీసుస్టేషన్లకు తరలించటం మామూలైపోయింది. మొత్తం చంద్రబాబు వైఖరి చూస్తుంటే తుపాను తర్వాత కూడా పరిస్దితి అంతా బాగానే ఉంది అని చెప్పటానికే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. అంతా బాగానే ఉందని ప్రభుత్వం అనుకుంటే సరిపోతుందా ? వాస్తవాలను ఎంతకాలమని దాచగలదు ?