కొడుకు పరారీలో ఉన్నాడు…మరి కోడెల ఏం చేస్తారో ?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ క్రీడాకారుడి దగ్గర నుండి ఉద్యోగం ఇప్పిస్తానని రూ 15 లక్షలు తీసుకున్న విషయంలో మాజీ స్పీకర్ తో పాటు కొడుకు కోడెల శివ రామకృష్ణ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ కు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శివరామ్ రూ. 15 లక్షలు తీసుకున్నాడట. డబ్బు తీసుకున్న దగ్గర నుండి ఉద్యోగం లేదు సరికదా అసలు మాట్లాడటమే మానేశారట. శివరామకృష్ణతో మాట్లాడదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరకపోయేసరికి చివరకు రంజీ ప్లేయర్ మాజీ స్పీకర్ కే ఫోన్ చేశారట.

ప్లేయర్ ఫోన్ చేయటమే కానీ తండ్రి, కొడుకులు ఎన్ని రోజులైనా సమాధానం చెప్పలేదు. దాంతో విసిగిపోయి ఫిర్యాదు చేద్దామని గుంటూరుకు వస్తే పోలీసులు అప్పట్లో పడనీయ లేదట. దాంతో వెనక్కు వెళ్ళిపోయారు. అయితే ప్రభుత్వం మారి పరిస్ధితుల్లో మార్పు రావటంతో తాజాగా నరసరావుపేటకు వచ్చి పోలీసులతో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది కదా ? అందుకనే కోడెల కుటుంబంపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే పోలీసులు కేసులు పెట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే కోడెలతో పాటు కొడుకుపైన కూడా కేసులు పెట్టారు.  అరెస్టు భయంతో కొడుకు ఎలాగూ పరారీలోనే ఉన్నాడు. మరి తనపైన కూడా కేసు నమోదు కావటంతో కోడెల ఏమి చేస్తారో చూడాలి ?