పోలవరం హక్కు కదా.! బతిమాలుకోవడమేంటి.?

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పోలవరం ప్రాజెక్టు వ్యవహారాల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించడమేంటి.? ఏం, ఎందుకు చర్చించకూడదు.? విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం శాఖ మీద కూడా వుంటుంది కదా.! వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, ‘బహుళార్దక పోలవరం.. మీ సహకారం అవసరం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. అందులో ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అడ్ హాక్ నిధులుగా 10 వేల కోట్లు అందించాలనీ, ప్రాజెక్టు కోసం చేసిన 2600 కోట్లను రీ-ఎంబర్స్ చేయాలనీ, ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని అమిత్ షా‌ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరినట్లుగా ప్రస్తావించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాన డిమాండ్లు’ అని అందులో పేర్కొన్నారు. పోలవరం వ్యయాన్ని అడ్వైజరీ కమిటీ ప్రకారం 55,548 కోట్లుగా ఆమోదించాలనీ అందులో పేర్కొనడం గమనార్హం.

‘పోలవరం ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన కొడుకు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాడు..’ అంటూ వైఎస్ జగన్ తన గురించి తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కేంద్రం దయతలచాలి. ఆ కేంద్రమేమో పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోవడంలేదు.

‘మీ సహకారం అవసరం’ అని బతిమాలుకుంటూ, ‘డిమాండ్లు’ అని పేర్కొనడంలోనే వైసీపీ ప్రభుత్వం తాలూకు డొల్లతనం బయటపడిపోతోంది. 2,600 కోట్లు రీ-ఎంబర్స్ కూడా చేయని కేంద్రం, 10 వేల కోట్లు ఎలా అందిస్తుంది.? 55,548 కోట్లుగా ప్రాజెక్టు వ్యాయన్ని ఎలా గుర్తిస్తుంది.?