ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనతో రాష్ట్రానికి ఏం ఒరిగింది.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చారు, వెళ్ళారు.! అంతేనా.? రాష్ట్రానికి మోడీ రాకతో అదనంగా ఒరిగిందేంటి.? విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి సహా, పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ కార్యక్రమాలు వర్చువల్‌గానే జరిగాయి గనుక, ప్రత్యక్షంగా విశాఖకు మోడీ రావడం వల్ల అదనపు ప్రయోజనమేమీ లేదన్నమాట.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ వర్చువల్ ఓపెనింగ్ అనేది ఢిల్లీ నుంచి కూడా చేసెయ్యొచ్చు కదా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు రావడంపై చాలా చాలా ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్ అంశంపై ప్రధాని ఏమన్నా మాట్లాడతారా.? అని ఎదురుచూశారంతా. దశాబ్దాల నాటి కల రైల్వే జోన్. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కిన హామీ అది. ఎనిమిదేళ్ళయినా, విశాఖ రైల్వే జోన్ పరిస్థితేంటో ఎవరికీ తెలియదు. కొత్త జోన్‌కి పేరు పెట్టారుగానీ, ఆ పనులు ముందుకు కదల్లేదు.

ప్రత్యేక హోదా ఎలాగూ కేంద్రం ఇవ్వదు. కనీసం, పోలవరం ప్రాజెక్టు గురించి అయినా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో గట్టిగా ప్రస్తావించి వుండాలి. గతంలో పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడేశారని ప్రధాని మోడీ ఇదే విశాఖలో ఆరోపించారు. రైల్వే జోన్ ఇచ్చేశామని కూడా చెప్పారు. మరి, ఆ పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితి ఏంటో విశాఖ పర్యటనలో ప్రధాని వివరించాలి కదా.? రైల్వే జోన్ సంగతేంటో స్పష్టతనివ్వాలి కదా.? అతి ముఖ్యమైన ఈ రెండు విషయాల్నీ ప్రధాని మోడీ లైట్ తీసుకున్నారు. అందుకే ప్రధాని మోడీ విశాఖ పర్యటనను ఖర్చు దండగ వ్యవహారమనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొంది.