పాడేరు ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి పరిస్ధితి చూస్తే పాపం అనిపిస్తుంది. పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్నా ఎవరి నుండి కూడా సహకారం అందటం లేదు. వైసిపి తరపున గెలిచి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించినందుకు స్ధానిక జనాలు చీ కొడుతున్నారు. అదే సమయంలో టిడిపి నేతలు కూడా ప్రచారంలో గిడ్డికి కలసి రావటం లేదు. దాంతో గిడ్డి పరిస్ధితి దయనీయంగా తయారైంది.
పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గిడ్డి గెలిచిన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నరేళ్ళ పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసిపి వాణిని బాగానే వినిపించింది. తర్వాత ఇతర ఫిరాయింపుల్లాగే ఆమె కూడా చంద్రబాబు ప్రలోభాలకు పడిపోయారు. అంతకుముందు వరకూ ఏజెన్సీ ఏరియాల్లో మారుమోగిపోయిన గిడ్డి పేరు ఫిరాయింపు తర్వాత నుండి రివర్సులో పడిపోయింది.
పార్టీ ఫిరాయించినందుకు జనాలు గిడ్డిని చీ కొట్టడం మొదలుపెట్టారు. ఏదైనా గ్రామాల్లోకి వెళితే గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉండగానే ఎన్నికల షెడ్యూల్ మొదలైంది. అసలు టికెట్ వస్తుందో రాదో కూడా అనుమానం అన్నారు. మొత్తానికి టికెట్ అయితే సాధించుకుంది. అయితే అక్కడి నుండే సమస్యలు మొదలయ్యాయి. ఓట్లు అడగటానికి వెళితే గ్రామాల్లోని జనాలెవరూ సానుకూలంగా స్పందించటం లేదు.
అదే సమయంలో టిడిపి నేతలు కూడా గిడ్డిని పట్టించుకోవటం లేదు. మొన్న నామినేషన్ వేసేముందు రోజు నేతలందరికీ కబురు చేస్తే ఒక్కరు కూడా కార్యక్రమానికి హాజరుకాలేదట. కనీసం మండలస్ధాయి నేతలు కూడా గిడ్డి నామినేషన్ వేసేటపడు హాజరుకాలేదు. దాంతో గిడ్డికి ఇపుడు సీన్ అర్ధమైపోతోందట. ఏం చేస్తాం చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత అని పెద్దలు ఊరికే అన్నారా ?