పిల్లి కూల్ అయిన వేళ… తూ.గో.లో తెరపైకి కొత్త చర్చ!

గతకొన్ని రోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వైసీపీలో రచ్చ రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మధ్య జరుగుతున్న రచ్చ ప్రస్తుతానికి ముగిసింది!

అవును… రామచంద్రపురం వైసీపీలో గతకొన్ని రోజులుగా జరుగుతున్న రచ్చ టీ కప్పులో తుఫానుగా మారిందని తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా మీడియా ముందుకు వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. జగన్ మాటే తనకు శిరోధార్యం అని అన్నారు. పార్టీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాల కృష్ణకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇస్తే రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తానని పిల్లి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని.. జనసేన లో చేరబోతున్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్.. పిల్లి సుభాష్ చంద్రబోస్ ని తాడేపల్లి పిలిపించి మాట్లాడారు. మరి ఈ సమావేశంలో ఏమి జరిగిందో తెలియదు కానీ… బోస్ మాత్రం కూల్ అయినట్లు కనిపించారు.

అనంతరం రాంచంద్రాపురం వచ్చిన ఆయన… అనుచరుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేసుకున్న ఆయన… ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు.

ఇదే సమయంలో… నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తానని చెప్పా­నని వివరించిన బోసు… ఇది బాధాకరమైన విషయమని అన్నారు. దీంతో… ఈ అంశంపై మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రామచంద్రాపురం రచ్చ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనుకున్న సమయంలో… జగన్ పరిస్థితిని చక్కబరిచేశారని ఊపిరి పీల్చుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. ఇదే సమయంలో పిల్లి బోస్ కి జగన్ ఎలాంటి హామీ ఇచ్చి ఉంటారనే కొత్త చర్చ కూడా స్టార్ట్ అవ్వడం గమనార్హం.