ఆర్సీపురం వైసీపీలో తుఫాను హెచ్చరికలు.. సంచలనంగా పిల్లి సుభాష్ వ్యాఖ్యలు!

నిన్నమొన్నటివరకూ చినుకు చినుకులుగా ఉన్నట్లు కనిపించిన రామచరంద్రాపురంలో వైసీపీ పంచాయతీ… ఒక్కసారిగా ఉరుములు మెరుపులుతో గాలివానగా మారింది. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ బలమైన ఈదురు గాలుల వంటి మాటలు మాట్లాడారు. ఫలితంగా… రామచంద్రపురం వైసీపీలో పిల్లి సుభాష్ వర్సెస్ మంత్రి వేణు వ్యవహారం పీక్స్ కి చేరినట్లు తెలుస్తుంది.

అవును… ఏపీలో రామచంద్రాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ – ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో జగన్ తో అత్యంత సాన్నిహిత్యంగా ఉండే రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగరేశారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రాపురం నుంచి జగన్ అసెంబ్లీ టికెట్ ఇస్తే… పార్టీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తాను గానీ, తన కుమారుడు కానీ… ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని తేల్చి చెప్పారు.

అయితే రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ సుమారు 30ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు. ఈ సమయంలో గతంలో అంటే పరిస్థితి వేరు.. ఇప్పుడు తాను అసెంబ్లీకి టిక్కెట్ ఆశిస్తున్న సమయంలో మళ్లీ వేణుకి ఇచ్చే విషయంలో అధిష్టాణానికి ఆయన అల్టిమేటం జారీ చేశారు.

దీనికి కారణం… పిల్లి సుభాష్ సొంత నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన పెత్తనం పెరిగిపోయింది. తోటి వైసీపీ కార్యకర్తలపైనే వేణు వర్గం దాడులకు దిగే పరిస్థితి నెలకొంది. ఇది నచ్చని ఎంపీ, తన కొడుక్కి ఆ సీటు కావాలన్నారు. కానీ జగన్ కుదరదన్నారని అంటున్నారు. జగన్ మాటగా పార్టీ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే వచ్చేసారి టికెట్ ఇస్తామని ఖాయంగా చెప్పారట. దీంతో పిల్లి సుభాష్ వర్గం రగిలిపోయింది.

ఈ సందర్భంగా… “కార్యకర్తలు, క్యాడర్‌ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ తోనే ఉన్నాం. వేణుతో కలిపి నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను” అని పిల్లి సుభాష్‌ తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా… అవసరమైతే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెంట్ గా పోటీచేస్తామని తేల్చి చెప్పారు. మరి ఈ వ్యవహారన్ని జగన్ ఎలా చల్లబరుస్తారు.. పైగా తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి… ఈ తుఫానును తీరాన్ని చేరకముందే ఎలా దారిమళ్లిస్తారు అనేది వేచి చూడాలి!