అసలు మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు రంగంలోకి దిగినట్లు.? ‘ఫోన్ ట్యాపింగ్ జరిగితే వచ్చిన ఇబ్బంది ఏంటి.?’ అంటారేంటాయన.? పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే. అది చట్ట వ్యతిరేక వ్యవహారం.
‘మేం ఫోన్ ట్యాపింగ్ చేయలేదు’ అనడం వరకూ ఓకేగానీ, ‘జరిగితే వచ్చిన ఇబ్బందేంటి.?’ అని పేర్ని నాని ప్రశ్నించడమంటే, వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో చిరంజీవి పేరుని పేర్ని నాని లాగుతుంటారు. అలా ఇలా కాదు, ‘చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం వుండదు..’ అని అంటుంటారు పేర్ని నాని. ఇవే వైసీపీని జనంలో పలచన చేస్తాయ్.
ఇక, ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటూనే.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేసేసిన పేర్ని నాని, చంద్రబాబుని కోటంరెడ్డి ఎప్పుడు కలిశారో కూడా చెప్పేస్తున్నారు. ఎవరెవరితో కోటంరెడ్డి ఏమేం మాట్లాడారో కూడా చెబుతున్నారు.
‘ఆడియో క్లిప్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది.. జాగ్రత్త..’ అని మాత్రమే ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సూచించారట.. ఈ క్రమంలోనే ఆ ఆడియో క్లిప్ పంపించారట. అలాగని పేర్ని నాని చెబుతున్నారు. ఇదెక్కడి చోద్యం.? ఇంటెలిజెన్స్‌కి వేరే పనే లేదా.? అధికార పార్టీ నాయకుల పట్ల అంత శ్రద్ధ ఎందుకు ఆ విభాగానికి.? ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా.?
ఇటు ప్రభుత్వాన్నీ, అటు పోలీస్ వ్యవస్థనీ పేర్ని నాని ఇరికించేస్తున్నారు.. తన అతి తెలివితేటలతో.!