రెండు రోజుల నుంచి ఏపీలో మాజీ మంత్రి వర్సెస్ కలెక్టర్ పంచాయతీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కలెక్టర్ జెడ్పీసమావేశానికి రావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేస్తుంటే.. ఆ సమావేశానికి తాను హాజరుకానవసరం లేదని కలక్టర్ చెబుతున్నారట. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారేలా ఉందని అంటున్నారట స్థానిక జనం.
అవును… కృష్ణాజిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరుకాకపోవడంపై వైసీపీ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిన్న సీరియస్ అయిన ఆయన… ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఇదే సమయంలో మరోవైపు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని కలిసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
మరోపక్క జడ్పీ సమావేశానికి కలెక్టర్ గైర్హాజరుపై సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేసిన పేర్నినాని.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని ఇచ్చిన హామీ మేరకు జగన్ ఆ పనిచేశారని గుర్తు చేసిన పేర్ని… అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు మాత్రం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయని, ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదని పేర్ని ఆరోపించారని తెలుస్తుంది. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా..? అని ఈ సందర్భంగా పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.
అనంతరం ఈ విషయంలో తానేమీ ప్రెస్టేజీకి పోవడం లేదని చెప్పిన పేర్నినాని… “ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడిని నాకేం ప్రెస్టేజ్ ఉంటుందని” చెబుతూ… అధికార పార్టీలో ఉన్నా వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పా..? అని అడిగారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఇవాళ సీఎంవోకు వెళ్లి సంబంధిత అధికారులకు వివరణ ఇచ్చారు. ఏ పరిస్ధితుల్లో తాను జడ్పీ సమావేశాలకు వెళ్లడం లేదో వివరించారు.
మరి ఒకరి ఫిర్యాదు.. మరొకరి వివరణ అనంతరం… ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాలి.