చిరంజీవి ఏదో అన్నారు.! దానికి వైసీపీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అంతే కాదు, మరో మంత్రి కొడాలి నాని కూడా చిరంజీవిపై విమర్శలు చేసేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరికొందరు మంత్రులూ మీడియా మందుకొచ్చి హంగామా చేశారు.
ఈ మొత్తం వ్యవహారంతో, చిరంజీవి – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఇప్పటిదాకా వున్న గ్యాప్ కాస్తా తొలగిపోయింది. సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులుగా చెలామణి అవుతున్న వైసీపీ నెటిజన్ల బండారమూ బయటపడిపోయింది. కలుగులో దాక్కున్న ఎలకలన్నీ బయటకొచ్చేశాయ్.. అన్నట్టు తయారైంది వ్యవహారం.
మరీ ముఖ్యంగా, మాజీ మంత్రి పేర్ని నాని ఏ ఉద్దేశ్యంతో చిరంజీవికి కౌంటర్ ఎటాక్ ఇచ్చారోగానీ, అది వైసీపీకి చాలా డ్యామేజ్ చేసేసింది. ‘గిల్లితే ఊరుకుంటామా.?’ అని పేర్ని నాని అనుకోవచ్చుగాక, అటువైపు కూడా అలాగే అనుకున్నారు.
పవన్ కళ్యాణ్ లెక్క వేరు. చిరంజీవి లెక్క వేరు.! జనసేనలో కొందరి అత్యుత్సాహం కారణంగా, మెగాభిమానుల్లో కొందరు ఇప్పటిదాకా జనసేన వైపు వెళ్ళేందుకు మొహమాటపడ్డారు. ఇప్పుడేమో, సీన్ మారిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ వేర్వేరు కాదని మొత్తంగా మెగాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
చిరంజీవిని పొగుడుతూ గతంలో పేర్ని నాని చేసిన కామెంట్స్ తాలూకు వీడియోల్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు మెగాభిమానులు. ‘అయినా, చిరంజీవిని ఇంతలా విమర్శించాల్సిన అవసరమేముంది.?’ అంటూ వైసీపీలోనే కొందరు, పేర్ని నాని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పేర్ని నాని కావొచ్చు, కొడాలి నాని కావొచ్చు.. వైసీపీకి వెన్నుపోటు పొడవట్లేదు కదా.?