నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.! కండిషన్స్ అప్లయ్.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర సుమారు 4 వేల కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా జరగనుంది.

అయితే, ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘జీవో నెంబర్ వన్’ కారణంగా, నారా లోకేష్ పాదయాత్ర ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదన్న వాదనలున్నాయి. మరోపక్క, పాదయాత్రకు సంబంధించి పోలీస్ యంత్రాంగం, కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ టీడీపీకి లేఖ రాసింది.

ఈ లేఖపై పెద్ద దుమారమే చేలరేగుతోంది. మరోపక్క, నారా లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతుల్ని పోలీస్ ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సుమారు 25 వరకు షరతులున్నాయన్నది టీడీపీ ఆరోపణ. అయితే, అవేవీ కఠినమైన షరతులు కావనీ, సూచనల్లాంటివేననీ, పాతిక షరతులు కాదని.. పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

‘ఎన్ని వాహనాలు పాదయాత్రలో పాల్గొంటాయ.? ఎంతమంది జనం పాదయాత్రలో పాల్గొంటారు.? ఎంతమంది నాయకులు ఆ యాత్రలో లోకేష్ వెంట వుంటారు.? వంటి వాటికి సంబంధించి సమాధానాలు అడిగాం. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే. వివరాలు చెబితే, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తాం..’ అన్నది పోలీస్ అధికారుల వెర్షన్.

కానీ, దీన్ని కూడా టీడీపీ వివాదాస్పదం చేయాలనుకుంటోంది. తద్వారా నారా లోకేష్ పాదయాత్రకు పబ్లిసిటీ తెచ్చుకోవాలని, సింపతీ క్రియేట్ చేయాలని టీడీపీ భావిస్తోంది.