రిపబ్లిక్ డే రోజున టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి పైనా, పొత్తు ధర్మం పైనా, అభ్యర్థుల ప్రకటనపైనా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు.. మండపేట, అరకు నియోజకవర్గాలను ప్రకటించారు కాబట్టి… తాను కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తాను అంటూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలను ప్రకటించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ సందర్భంగా తనపై కూడా ఒత్తిడి ఉందని, అందువల్లే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. చంద్రబాబుకే కాదు తనకు కూడా ఒత్తిడి ఉంటుందని చెబుతూ ఉమ్మడి తీర్పుగోదావరి జిల్లాల్లోని రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. అయితే… చంద్రబాబు మాదిరి అభ్యర్థులను మాత్రం ప్రకటించుకోలేకపోయారు. దీంతో జనసేన వర్గాలు కొంతవరకు హ్యాపీ ఫీలయ్యాయి.
పవన్ మారిపోయారని.. చంద్రబాబు బానిసగా బ్రతకడం లేదని.. టీడీపీని కాదని పవన్ సొంత నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబు నిర్ణయాలు అన్నింటికీ పవన్ డూ డూ బసవాన్నలా తలూపడం లేదనే కామెంట్లూ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా… ఇదంతా వట్టి డ్రామా అని కొట్టిపారేశారు.
ఇందులో భాగంగా రిపబ్లిక్ డే రోజున పవన్ చేసింది చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రమే అని… చూశారా చంద్రబాబు ముందు పవన్ జీహుజూర్ అనడం లేదు.. ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నారు అని.. అవసరమైతే ఎదురు తిరగడానికి కూడా వెనుకాడరని.. జనసైనికులు అలా అనుకోవాలని పవన్ కల్యాణ్ ఆ రెండు నియోజకవర్గాల పేర్లు ప్రకటించారని పేర్ని నాని అన్నారు.
ఇంకా గట్టిగా, మరింత స్పష్టంగా చెప్పాలంటే… ఆ రెండు నియోజకవర్గాలూ పవన్ లాక్కున్నవి కావని, చంద్రబాబు గతంలోనే విదిల్చినవని క్లారిటీ ఇచ్చారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ చార్జ్ లను కూడా నియమించలేదని గుర్తు చేసిన ఆయన… ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు.. ఏనాడో జనసేనకే వదిలేశారని క్లారిటీ ఇచ్చారు.
అంటే గతంలో చంద్రబాబు జనసేనకు కేటాయించి, అక్కడ తమ ఇన్ ఛార్జ్ లను ప్రకటించని సీట్లనే పవన్ ప్రకటించారన్నమాట. ఇదే విషయాలపై మరింత స్పష్టత ఇచ్చిన పేర్ని నాని… జనసైనికుల్లోనూ, పార్టీ నేతల్లోనూ తనపై వస్తున్న వ్యతిరేకత చల్లార్చేందుకే పవన్ అభ్యర్థుల ప్రకటన పేరుతో డ్రామా ఆడారని.. తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జోకొట్టడానికే ఈ స్కెచ్ వేశారని అన్నారు.
పవన్ కల్యాణ్ కు నిజంగా అంత పౌరుషమే ఉంటే.. కీలక స్థానాలను ప్రకటించే వాడని.. చంద్రబాబు వదిల్చిన నియోజకవర్గాల పేర్లు ప్రకటించేసి తానేదే రియల్ హీరో అనిపించుకునే పెర్ఫార్మెన్స్ చేశారని.. అదంతా కాపులను ఏమార్చే కార్యక్రమంలో భాగమని జనసైనికులకు తెలియడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టలేదని పేర్ని ఫైరయ్యారు.
పవన్ కు నిజంగా అంత దమ్ముంటే… వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాలని, ఆయా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు! ఈ క్లారిటీ విన్న తర్వాత… పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్ ప్రకారం జనసైనికులను, జనసేన నేతలను మోసం చేస్తున్నారా.. ఏమార్చుతున్నారా అనే చర్చ మొదలైంది. ఒకవేళ పేర్ని నాని ఆలోచనే నిజం అయితే… ఇంతకు మించిన వెన్నుపోటు మరొకటి ఉండదనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం.