వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కింజారపు అచ్చెన్నాయుడు గట్టిగా టార్గెట్ అయ్యారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అరెస్ట్, జైలు, హాస్పిటల్, కరోనా అంటూ నరకాన్నే చూశారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. దీంతో ఆయన ప్రతిదాడి స్టార్ట్ చేశారు. తాజాగా మళ్ళీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఈసారి పంచాయతీ ఎన్నికల గొడవల్లో. శ్రీకాకుళంలో అందునా నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఫాలోయింగ్ పెద్దది. ఆయన్ను ఓడించడం దాదాపు అసాధ్యమే. నిమ్మాడలో అయితే టీడీపీని కాదని పాక చూపులు చూసే జనం పదుల సంఖ్యలో కూడ ఉండరు. అందుకే ఆయన్ను దెబ్బకొట్టడానికి ఆయన కుటుంబాన్నే వాడారనే వాదం వినిపిస్తోంది.
ఈసారి సర్పంచ్ పదవిలో కింజారపు అప్పన్న వైసీపీ మద్దతుతో నిలబడుతున్నారు. ఈ అప్పన్న ఎవరో కాదు ఎర్రన్నాయుడి సోదరుడి కుమారుడు. అంటే వరుసకు అచ్చెన్నకు కుమారుడు అవుతాడన్నమాట. ఎప్పటి నుండో అచ్చెన్నాయుడితో అప్పన్నకు పెద్దగా పొసిగేది కాదని చెబుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకునే అప్పన్నకు సర్పంచ్ పదవి ఆశ చూపించరాని, పైగా అచ్చెన్నాయుడుకు ఎదురు నిలవడానికి వైసీపీకి అభ్యర్థులే దొరకలేదని అందుకే అప్పన్నను చేరదీశారని చెబుతున్నారు టీడీపీ నేతలు. టెక్కలి వైసీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుండి దూకుడుగానే ఉంటున్నారు.
అచ్చెన్నాయును అణగదొక్కి అధిష్టానం వద్ద పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. వచ్చే దఫాలో టికెట్ పొందేందుకే ఈ తాపత్రయమంతా. అందుకే పంచాయతీ ఎన్నికల్లో టెక్కలిలో సత్తా చాటాలని ఉద్దేశ్యంతో అప్పన్నను వాడారని, లేకుంటే ఇన్నాళ్లు బయటకురాబీ విబేధాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయని, అప్పన్న లాంటి అతి సామాన్యుడి మీద అందునా కుటుంబ సభ్యుడి మీద దాడి చేయించాల్సిన అవసరం అచ్చెన్నాయుడుకు ఏముందని వాదిస్తున్నారు. ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగిందని, వారికీ పోలీసులు తోడై అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఎలాగైనా కింజారపు కుటుంబాన్ని శ్రీకాకుళంలో కనుమరుగుచేయడానికే ఈ కుట్రలని అంటున్నారు.