సీరియల్ డ్రామాల్లో జేసీ చంద్రబాబును మించిపోయారే ? 

Peoples comments on JC Prabhakar Reddy's protest
జేసీ సోదరులంటే ఒకప్పుడు మాంచి వెయిట్ ఉండేది.  కానీ ఇప్పుడది లేదు.  వారికి సంబంధించిన ఏ చిన్న వివాదమైనా రాష్ట్రం మొత్తం ఆసక్తిగా గమనించేది.  కారణం వారి నేపథ్యం, పొలిటికల్ హిస్టరీ.  దశాబ్ద కాలంపాటు రాజకీయాల్లో తమకు ఎదురేలేదన్నట్టు అనంతపురం జిల్లాలో వారి హవా నడిచింది.  ఫ్యాక్షన్ చరిత్ర కూడ ఉండటంతో జనం వారిని చూసే కోణం కూడ భిన్నంగా ఉండేది.  కానీ గత ఎన్నికల్లో వారి వారసులు ఇద్దరూ ఓడిపోవడంతో పరిస్థితి మారింది.  ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు సైలెంట్ అయ్యారు.  రాజకీయాల్లో ఇలాంటి ఒడిదుడుకులు మామూలే  అయినా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే వారిని పలుచన చేశాయి. 
 
Peoples comments on JC Prabhakar Reddy's protest
Peoples comments on JC Prabhakar Reddy’s protest
జగన్ ప్రభుత్వం వారి ట్రావెల్స్, మైన్స్ మీద గురిపెట్టింది.  దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  ప్రభుత్వం వారికి 100 కోట్ల జరిమానాలు విధించింది.  ఇన్ని జరిగినా జేసీ సోదరుల నుండి ధీటైన రియాక్షన్ రాకపోవడంతో వారి పని అయిపోయిందని అంతా అనుకున్నారు.  తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి హంగామా చేసినా ఏమీ చేయలేకపోయారు.  పైగా వారి మీదనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టబడ్డాయి. దీంతో జేసీ సోదరులు  తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయానికి వచ్చారు.  
 
ఎలాగూ ఇలాంటి దీక్షలను పోలీసులు చివరి నిముషంలో భగ్నం చేస్తారని  అందరికీ తెలుసు.  అనుకున్నట్టే ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలను హౌజ్ ఆర్ట్స్ చేశారు.  ప్రభాకర్ రెడ్డి తన ఇంట్లోనే నల్లదుస్తులతో దీక్షకు కూర్చున్నారు.  అక్కణ్ణుంచి టీడీపీ మార్క్ డ్రామా మొదలైంది.  చంద్రబాబు నాయుడు చేసే పబ్లిసిటీ స్టంట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  పోలవరం ప్రాజెక్ట్  ముందు జయము జయము చంద్రన్నా అంటూ భజన చేయించుకున్న ట్రాక్ రికార్డ్ ఉంది ఆయనకు.  ఎయిర్ కండిషన్డ్ టెంట్లో మెత్తటి పరుపుల మీద కూర్చుని దీక్షలు చేసిన వ్యక్తి.  ఎన్నికల్లో ఓడితే జనం వలవల ఏడ్చుకుంటూ కరకట్ట మీదున్న ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చి వచ్చారు.  ఓట్లు వేయని జనం చంద్రబాబు ఓడిపోతే కన్నీళ్లేలా కార్చారో ఇప్పటికీ మిస్టరీనే. 
 
అలా డైలీ సీరియళ్లను తలపించే డ్రామాలు నడిచాయి.  తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షలో కూడ అలాంటి సీన్లే కనబడ్డాయి.  నూతన వధూవరులు దీక్ష స్థలి వద్దకే వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటే ప్రభాకర్ రెడ్డి కొన్ని గంటలు ఆకలితో కూర్చోవడాన్ని చూసి మహిళలు ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుని ఆయన చేత నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేస్తారు.  ఇవన్నీ చూస్తే టీవీ సీరియళ్లు కాకపోతే ఇంకేం గుర్తుకొస్తాయి.  వీటిని చూసిన జనం ఈ డ్రామాల ముందు చంద్రబాబు కూడ నిలవరేమో అంటున్నారు.