పెగాసస్.! వివాదాలు ఫుల్.! రాజకీయ లబ్ది నిల్.!

పెగాసస్ వ్యవహారానికి సంబంధించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపుతోందా.? ఈ విషయమై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలంటూ పెగాసస్ స్పై వేర్ కొనుగోలు చేసిందీ, లేనిదీ స్పష్టత లేనప్పుడు, పెగాసస్ వాడి పెద్ద కుంభకోణానికి అప్పటి టీడీపీ సర్కారు పాల్పడిందని వైసీపీ ఎలా చెప్పగలుగుతుంది.?

వైసీపీ ప్రస్తుతం అధికారంలో వుంది. ఇంటెలిజెన్స్ విభాగం ఏయే కొనుగోళ్ళు చేసిందన్నదానిపై స్పష్టమైన సమాచారం ప్రభుత్వం వద్దనే వైసీపీకి దొరుకుతుంది. మరోపక్క, ఇది జాతీయ, అంతర్జాతీయ లింకులున్న సమస్య. కేంద్రాన్ని అడిగి తేల్చుకోవాల్సిన వ్యవహారం.

ఎన్నికలనగానే, ఓటర్ల తొలగింపు అంశం సర్వసాధారణం. ఎవరు అధికారంలో వున్నా చేసేది అదే. స్థానిక ఎన్నికల వేళ ఓట్ల గల్లంతుపై చాలా విమర్శలొచ్చాయ్. వైసీపీ సర్కారు మాత్రం, ‘అబ్బే, తొలగింపు లేదు..’ అని చెప్పింది. గతంలో చంద్రబాబు సర్కారుదీ ఇదే వాదన.

డేటా చౌర్యం.. అనేది నిజానికి చాలా పెద్ద సమస్య. కానీ, అది సామాన్యుడికి అర్థం కాదు. ప్రభుత్వాలు దాన్ని నిరూపించలేవు. కేవలం రాజకీయ లబ్ది కోసం రాజకీయ ఆరోపణలు చేస్తే, ప్రజల్లో పలచనైపోవడం తప్ప ఇంకేమీ జరగదు. పైగా, వైసీపీ చేస్తున్న అతి కారణంగా టీడీపీ మీద ప్రజల్లో సింపతీ పెరిగే అవకాశం వుంది.

అమరావతి కుంభకోణమన్నారు.. కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేదు.. పెగాసస్ విషయంలోనూ అదే జరుగుతుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.