సామాజిక న్యాయం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఒక కులాన్ని నమ్ముకొని తాను రాజకీయాలలోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని వారు తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఆ కుటుంబాలు సీఎం చంద్రబాబు మరియు వైఎస్ జగన్ కుటుంబాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కులాల కుంపటి వల్ల దేశం విచ్చిన్నం కాకూడదని అధికారం సహజంగా రావాలి తప్ప దాని కొసం పాకులాడకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.
తాను కులాన్ని ఓటు బ్యాంకుగా చూడటం లేదని, అన్ని కులాల బాగుకోసం జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 120 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. ఆయనకు మాట ఇవ్వడానికి మనసు ఉంటుంది కానీ దానిని నిలబెట్టుకోవడానికి మనసు ఉండదని పవన్ విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులక మద్దతు ఇస్తే న్యాయం జరుగుతుందో లేదో ఒక్కసారీ ఆలోచించుకోవాలన్నారు. నేను మాటిస్తే 100 శాతం నిలబెట్టుకుంటాను అందుకే ఆచితూచి హమీలిస్తున్నాను. హామీ ఇచ్చిన దానికంటే 10 శాతం ఎక్కవే చేసి చూపిస్తానని పవన్ అన్నారు.
అందరిని సమానంగా చూడగలిగే ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఆటోయూనియన్లను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా జీవించే పరిస్థితి జనసేన కల్పిస్తుంది. మీ పై వేధింపులకు పాల్పడే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ వారికి భరోసా ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బిసిలు వ్యతిరేకిస్తారని, బిసిలకు ఇస్తే కాపులు వ్యతిరేకిస్తారని ఒకరంటే ఒకరని పేర్లు చెబుతూ దొంగ రాజకీయాలు చేస్తున్నారని పవన్ టిడిపి, వైసీపీలను ఎద్దేవా చేశారు. జనాభాలో సగం ఉన్న బిసీలలో ఐక్యత లేకపోవడం వలనే వెనుకబాటుతనం వచ్చిందని పవన్ తెలిపారు.