గుడ్ న్యూస్: వారాహి బయటకు వస్తుంది.. ఎప్పుడంటే…?

జనసేన అభిమానులకు, కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్నిచ్చిన పవన్ ఎన్నికల స్ట్రాటజీల్లో వారాహి ఒకటి. ఈ ప్రచార రథంపై జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ రథంపై పవన్ ముందుకు కదులుతూ, నియోజకవర్గాలన్నీ చుట్టుముట్టి వస్తారని, ఫలితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం ఖాయమని నమ్మారు. అయితే… పవన్ బందరు సభలో ఒకసారి బయటకు తీసుకొచ్చి, రోడ్డెక్కించి, అభిమానులకు చూపించి… మళ్లీ షెడ్ లో పెట్టేశారు.

దీంతో జనసైనికులు తీవ్ర నిరాశా నిసృహల్లోకి వెళ్లిపోయారు. ఇలా అయితే ఎలా? అంటూ వారిలో వారు ప్రశ్నించుకుంటూ మదనపడిపోయారు. మరోపక్క… లోకేష్ యువగళం పాదయాత్రపై మీడియా ఫోకస్ తగ్గిపోతుందని, జనాల కాన్సంట్రేషన్ వారాహిపైకి వచ్చేస్తుందని, ఫలితంగా యువగళం అట్టర్ ప్లాప్ అయిపోతుందని.. అందుకే బాబు హెచ్చరికల మేరకు పవన్.. వారాహిని బయటకు తీసుకురావడం లేదని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వారాహిని బయటకు తీయాలని పవన్ ఫిక్సయ్యారు.

అవును… “ఏపీ రోడ్లపై వారాహి, ఆ వారాహిపై పవన్” ని చూసే అదృష్టం జనసైనికులకు మరోసారి కలగబోతుంది. వ‌చ్చే నెలలో పోల‌వ‌రం ప్రాజెక్టును జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సంద‌ర్శిస్తార‌ని.. ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. అదే రోజు బ‌హిరంగ స‌భ‌లో కూడా పాల్గొంటార‌ని ఆయ‌న పేర్కొన్నారు. లోకేష్ యాత్ర పూర్తయ్యే వరకూ… అస‌లు వారాహి జ‌నంలోకి వ‌స్తుందా? రాదా? అనే అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల్లో మొద‌ల‌యిన నేపథ్యంలో… మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు.

వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఫిక్సయిన పవన్ కల్యాణ్… ఆ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసి, అనంతరం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయబోతున్నారు. ఆ సభలో… గత చంద్రబాబు ప్రభుత్వం, నేటి జగన్ ప్రభుత్వం ఈ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాయో చెప్పబోతున్నారంట. జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేదనే కామెంట్లపై పవన్ స్పందించకపోయినా… పోలవరం పూర్తవ్వకపోవడంలో బాబు – జగన్.. ఇద్దరి పాత్రా ఉందనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పబోతున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో… బహిరంగ సభకు నాలుగైదు కిలోమీటర్ల ముందు వారాహిని ప్రదర్శనకు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆ ప్రదర్శన అనంతరం… ఆ రథంపై పవన్… అభిమానులకు, కార్యకర్తలకు అభివాదాలు చేసుకుంటూ… సభా స్థలికి చేరుకుంటారని తెలుస్తుంది. సో… జనసైనికులు, వీరమహిళలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. త్వరలో మరోసారి వారాహిని మరోసారి చూసే అవకాశం పవన్ కల్పించబోతున్నారని చెబుతున్నారు జనసేన సీనియర్ నేతలు.

కాగా… పోలవరం ప్రాజెక్టు దగ్గరకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీసానంటూ గతంలో మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!