ఏపీలో కూడా ఎన్నికల సందడి మొదలైపోయింది. అధికార వైసీపీ ఇప్పటికే ప్రజలతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్తూ… ఇంతకాలం తాము చేసిందేమిటో చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన తర్వాత టీడీపీకి సానుభూతి పెరిగిందని చెబుతున్నారు. ఈ వయసులో చంద్రబాబును జైల్లో పెట్టించడం ఒక వర్గంలో పూర్తి పాజిటివ్ గా మారిందని, ఆ సానుభూతి పవనాలు టీడీపీకి ప్లస్ అవుతాయని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైఎస్ జగన్ ను గద్దెదింపడమే తమ ఉమ్మడి లక్ష్యమని, ఆ సమయం ఆసన్నమైందని తెలిపారు. దీంతో… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని అన్నారు. మరోపక్క నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని కూడా చెప్పారు. అయితే.. అది జరగలేదు. దీంతో… చెప్పింది పవన్ కాబట్టి జరగకపోయినా లైట్ తీసుకోవచ్చనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి!
ఆ సంగతి అలా ఉంటే… త్వరలో సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు. పైగా చంద్రబాబు కూడా బయటకు వచ్చారు కాబట్టి.. ఈ విషయంపై నవంబర్ 28లోపు ఒక స్పష్టత ఇస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తిరుపతి స్థానం మాత్రం జనసేనదే అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాదేండ్ల మనోహర్ తాను పోటీచేయబోయే స్థానాన్ని స్వయంగా ప్రకటించుకున్నారు.
ఇక అధినేత పవన్ ఎక్కడి నుంచి పోటీచేయబోతున్నారనే విషయంలో తీవ్ర చర్చ నడుస్తుందని తెలుస్తుంది. అయితే ఈసారి సీట్ల సర్ధుబాటులో భాగంగా రెండు చోట్లా పోటీచేసే సౌలభ్యం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేయడం ఆల్ మోస్ట్ ఫైనల్ అని అంటున్న దశలో… పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తారనే కామెంట్లు వినిపించాయి.
అయితే అందుకు పవన్ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ మనసంతా గోదావరి జిల్లాల్లో పోటీ చేసి గెలవాలనే ఉందని అంటున్నారు. అయితే… ఇప్పటికే తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ గా కిరణ్ రాయల్ ఉన్నారు కాబట్టి… ఆయనకే సీటు అనే ప్రచారం నడిచింది. ఈ సమయంలో అలాంటిది ఏమీ లేదని.. పవన్ మనసులో మరో ఆలోచన ఉందని.. భూమన ఫ్యామిలీని కొట్టాలంటే… కిరణ్ రాయల్ సరిపోరని.. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న ఒక డాక్టర్ పేరు తెరపైకి తేబోతున్నారని తెలుస్తుంది.
కిరణ్ రాయల్… హుందాగా ఉండడని, నోటికి హద్దూ అదుపూ ఉండదని, తిరుపతి లాంటి నియోజకవర్గంలో ప్రజలు హుందాతనంతో కూడిన వ్యక్తులను, సౌమ్యులైన నాయకులను కోరుకుంటారని అంటుంటారు. దీంతో కిరణ్ రాయల్ వల్ల అవ్వదని పవన్ భావించి… మరో వ్యక్తి పేరు తెరపైకి తెచ్చారని తెలుస్తుంది. ఆయన పేరు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్! ఈయనకు మెగా ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు.
దీంతో… ఈ పరిస్థితుల్లో కిరణ్ రాయల్ కంటే పసుపులేటి హరిప్రసాద్ చాలా రెట్లు బెటర్ అనే ఆలోచనకు పవన్ వచ్చారని తెలుస్తుంది. హుందాతనంగా ఉండే హరిప్రసాద్ అయితేనే తిరుపతి లాంటి నియోజకవర్గానికి సెట్ అవుతారని, భూమన అభినయ్ కి గట్టిపోటీ ఇవ్వగలుగుతారని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే డాక్టర్ హరిప్రసాద్ కు పవన్ కల్యాణ్ టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇప్పించారు!
ఇలా ఎన్నికలు సమీపిస్తునన్ వేళ పవన్ కల్యాణ్ కూడా తెరవెనుక పార్టీ బలపడటానికి అనువైన కార్యక్రమాలు కూడా చేసుకుంటూపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే… సీట్ల సర్ధుబాటు విషయంలో వీలైనంత తొందరగా క్లారిటీకి వచ్చేస్తే… వ్యవహారం మరింత కంఫర్ట్ జోన్ లోకి వెళ్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా… గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలని భావిస్తున్న పవన్… కిరణ్ రాయల్ కు షాకివ్వడం గొప్పవిషయమే!