సీఎం పదవిపై పవన్ కీలక వ్యాఖ్యలు… జనసైనికులు చప్పట్లు, విజిల్స్?

ముఖ్యమంత్రి పదవిపై పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ చేసినన్ని వ్యాఖ్యలు, మార్చినన్ని మాటలు ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడూ కూడా మార్చి ఉండరన్నా అతిశయోక్తి కాదేమో. దీంతో.. నిజంగా సీఎం అయ్యేనాయకుడు కూడా ఇన్ని సార్లు ఆ పదవిపై తన అభిప్రాయాన్ని చెప్పి ఉండరేమో అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి సీఎం పదవి, అందుకు తన సుముఖత వంటి విషయాలపై తనదైన శైలిలో స్పందించారు పవన్.

అవును… మిగిలిన సమయంలో మాట్లాడిన చిన్నా చితకా మాటల సంగతి కాసేపు పక్కనపెడితే వారాహి యాత్రలో భాగంగా తాను సీఎం పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు. దీంతో జనసైనికులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇన్నాళ్లూ తమతో బాబు పల్లకి మోయిస్తారేమో అనుకున్నాం.. కాదు, పవన్ సీఎం అభ్యర్థి అని హ్యాపీ ఫీలయ్యారు. కట్ చేస్తే… తూచ్ అన్నారు పవన్ కల్యాణ్!

సీఎం పదవిపై ఈ ప్రకటన చేసిన వెంటనే ఒకవర్గం మీడియా పవన్ ను ఇంటర్వ్యూ చేసింది. దీంతో… ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించిన పవన్… అబ్బే అలా ఏమీ లేదు! మా జనసైనికులను తృప్తి పరచడానికి తాను అలా మాట్లాడాను.. సీఎం పదవి కావాలంటే చాలా సీనియారిటీ కావాలి.. అది తనకు లేదు! అని నాలుక మడతపెట్టారు. దీంతో ఓపికున్న జనసైనికులంతా పవన్ పై ఆఫ్ ద రికార్డ్ ఫైరయ్యారు!

అనంతరం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయ్యారు. దీంతో… కొంతమంది జనసైనికులు హ్యాపీ ఫీలయ్యారనే కామెంట్లు వినిపించాయి! ఇక వైసీపీకి తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని, పవన్ కు ఇది అద్భుతంగా కలిసి వచ్చిందని, పార్టీ వ్యూహాత్మకంగా పుంజుకోవడానికి ఇదొక గొప్ప సువర్ణావకాశమని అంతా భావించారు! కానీ… జనసైనికులు ఒకటి భావిస్తే, జనసేనాని ఒకటి భావిస్తారు. కారణం… ఆయన “లెక్క” ఆయనకుంటుంది!

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాకత్ అయిన పవన్… బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీంతో… ఈ ఊహించని పరిణామానికి హర్ట్ అయిన జనసైనికులు అప్పటినుంచి పార్టీని, పవన్ ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో కీలకమైన నేతలు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. రాజానగరం, పిఠాపురం, నెల్లూరు ల్లో కీలక నేతలు బై బై పవన్ అని చెప్పారు!

ఈ సమయలో తాజాగా మరోసారి సీఎం పదవిపై స్పందించారు పవన్. “సీఎం స్థానం పట్ల ఏరోజూ విముఖత చూపలేదు.. సుముఖతతోనే ఉన్నా.. కానీ, ఈరోజు మనకు సీఎం పదవికంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యం. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది. పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు. ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నాం.” అని చెప్పుకొచ్చారు. అంటే… టీడీపీతో పొత్తు పలు నివేదికల ఫలితం అని చెప్పే ప్రయత్నం చేశారన్నమాట.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… “ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది” అని అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇంతకంటే ప్రతికూల సమయం ఉంటుందా? జనసేన సరిగ్గా నిలదొక్కుకోవడానికి అనుకూలమైన సమయం ఇంతకంటే మరొకటి వస్తుందా? కానీ… పవన్ చెబుతున్నదేమిటి…? ఈ సమయంలో టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టి… జనసేన మద్దతుగా ఉంది అని! దీనికి… జనసైనికులు చప్పట్లు, విజిల్స్!!