హాఫ్ హ్యాపీ: గ్లాసు గుర్తు జనసేనకే కానీ….!

గతకొన్ని రోజులుగా వైసీపీ నేతల నుంచి జనసేన అధినేత పవన్ కు గట్టి కౌంటర్లు పడుతున్నాయి. అందులో ప్రధానంగా “చెప్పులు పోయాయి” అంటూ పవన్.. పేర్ని నాని రెండు చెప్పులూ చూపించినప్పుడు వ్యాఖ్యానించిన మాటలపై మరింత పెరిగాయి. ఇందులో భాగంగా… “చెప్పులు పోతే ఏదో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు కానీ… ముందు గ్లాసు సింబల్ పోయింది ఆ సంగతి చూడు” అంటూ సెటైర్లు పడ్డాయి.

ఈ నేపథ్యంలో జనసేనకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగా.. గాజు గ్లాసు గుర్తుని ఆ పార్టీకే కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వ్ డ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో ఉంచింది. దీంతో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దూరం కాలేదని స్పష్టమైంది. దీంతో జనసైనికులు కాస్త కుదుటపడ్డారు. కానీ.. ఇక్కడ మరో మెలిక ఉంది.

అవును… ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని ఎన్నికల సంఘం కొనసాగించింది. అంటే… ఈ సింబల్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందన్న మాట. కారణం.. సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు ఇంకా ఫ్రీ సింబల్స్ లిస్ట్ లోనే ఉంది. ఇది మాత్రం జనసేన నేతలకు, కార్యకర్తలకు ఆందోళన కలిగించే అంశమే అనడంలో సందేహం లేదు.

కాగా… దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఏపీలో వైసీపీ, టీడీపీ లు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలవగా… తెలంగాణలో ఎంఐఎం, బీఆరెస్స్తో పాటు టీడీపీ, వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో జనసేన కు మాత్రం ఈ జాబితాలో చోటు లేకపోవడంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసు… ఫ్రీ సింబల్స్ జాబితాలో కొనసాగుతోంది.