పవన్ లక్ష్యాలు మారుతున్నాయి.. ఇలా చెబితే నమ్మొచ్చు?

పవన్ లక్ష్యాలు రెగ్యులర్ గా మారుతుంటాయని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. వారి విశ్లేషణలు నిజం చేస్తూ నిత్యం పవన్ వ్యవహార శైలి అలానే కొనసాగుతూ ఉంటుంది. జనసైనికులను ప్రతీ సభలోనూ ఒక కొత్త కన్ ఫ్యూజన్ కు గురిచేస్తుంటారని కూడా అంటుంటారు. ఆ విమర్శకు కూటా తనకు వీలైనంతవరకూ పవన్ న్యాయం చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

అవును… ఏపీలో జనసేనానిది ఒక భిన్నమైన వైఖరి. ఆయన ఎప్పుడు ఏమి చెప్పినా దానికి తర్వాతి రోజు స్టిక్ ఆన్ అయ్యి ఉంటారనే గ్యారెంటీ లేదు! మాట మార్చిన ప్రతీసారీ దానికి ఆయన “వ్యూహం” అని నామకరణం చేస్తుంటారు. దానివల్ల ప్రజల్లో క్రెడిబిలిటీ పోతుందనే ఆలోచన ఆయనకు రాకపోవడం గొప్పవిషయమే. ఇదే సమయంలో జనసైనికుల మేదాసక్తిపై ఆయన నమ్మకం ఆ స్థాయిలో ఉండి ఉండొచ్చు కూడా!

మొదట్లో ముఖ్యమంత్రి అవుతానన్నారు.. అనంతరం తనకు అంత సీన్ లేదని కుండబద్దలు కొట్టారు. గతంలో ఒంటరిగా వెళ్తే వీరమరణమే, ఈసారి బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు అన్నారు.. అనంతరం పొత్తు కన్ ఫాం అన్నారు.. తర్వాత ఒంటరిగా అయినా వెళ్లొచ్చు అని స్పందించారు. ఇదే సమయంలో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశే తన లక్ష్యం అని ప్రకటించారు.. ఇప్పుడు తాజాగా వైసీపీ రహిత గోదావరి అంటూ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

తాజాగా కాకినాడలో జనసేన నేతలతో మాట్లాడిన ఆయన… వైసీపీ రహిత గోదావరి జిల్లాలను చూడటమే జనసేన ప్రణాళికగా ఉండాలన్నారు. నా ప్రతినిధులుగా జనాల్లోకి వెళ్లండి, పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, బాధ్యతగల నాయకులుగా ఎదగండి అంటూ వారికి ఉద్బోధించారు. అవును… గోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీకి రాకూడదంటున్నారు జనసేనాని.

అంతవరకూ బాగానే ఉంది కానీ… మరి ఆ 34 సీట్లలోనూ జనసేన పోటీ చేస్తుందా.. అంటే పవన్ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. జనసేన 34 స్థానాల్లోనూ పోటీ చేసినా చేయకపోయినా… వైసీపీ మాత్రం రాకూడదు అని పవన్ చెబుతున్నట్లు అన్నమాట. ఇక్కడే పవన్ తో జనసైనికులకు ఉన్న అతి పెద్ద సమస్య. 34 స్థానాల్లోనూ జనసేననే గెలిపించండి అని చెప్పడానికి పవన్ కు చాలా ధైర్యం కావాలి.

గోదావరి జిల్లాల్లో జనసేన జెండా మాత్రమే ఎగరాలని ఆయన నేతలకు పిలుపునిస్తే పవన్ కచ్చితంగా సూపర్ గా చెప్పినట్లే. ఇదే సమయంలో 34జిల్లాల్లోనూ జనసేన నేతలు పోటీకి నిలబడతారు.. జనసేన నేతలందరినీ గెలిపించుకోవాలి అని పిలుపునిస్తే అంతకు మించి సూపర్. కానీ… దానికి చాలా గట్స్ ఉండాలి.. అంతకంటే ముందు క్లారిటీ ఉండాలి. వైసీపీని 34 సీట్లలోనూ ఓడించండి పిలుపునివ్వడానికి అవేమీ అవసరం లేదు. ఒక విమర్శ చాలు.

అంతోటి విమర్శ నోటాతో పోటీ పడే బీజేపీ చేస్తుంది.. అంతకంటే తక్కువైన కాంగ్రెస్ కూడా చేస్తుంది. మనుగడ ప్రశ్నార్థకమైన కమ్యునిస్టులు కూడా చేస్తారు. అంతోటి దానికి జనసేన అధినేతే కావాలా? సో… ఎప్పుడైతే వైసీపీ టాపిక్ ఎత్తకుండా… వైసీపీ రహిత గోదావరి అనే బదులు… జనసేన సహిత గోదావరి అని అంటే మరింత బాగుండేది. కానీ… పవన్ అలా అనలేదు.

మనం పోటీ చేస్తామో లేదో తెలియదు కానీ, వైసీపీకి మాత్రం ఈ సీట్లు దక్కకూడదు అనే మాటలు చెప్పినంత కాలం… జనసేనాని మాటలకు విలువ ఉండదన్న విషయం ఆయన ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడే జనసేనకు మనుగడ. అప్పటివరకూ ఇలాంటి యాత్రలు, సభలు ఎన్నేసి పెట్టుకున్నా… అవి ఎల్లో షేడ్ తో ఉన్న జనసేన జెండానే చూపిస్తాయి తప్ప మరొకటి కాదని పవన్ గ్రహించాలని చెబుతున్నారు పరిశీలకులు.