జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు. జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడి మీద చెయ్యి చేసుకున్న పోలీస్ అధికారిణిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు జనసేన అధినేత. వేలాది మంది జనసైనికుల హంగామా నడుమ, జనసేనాని తిరుపతి టూర్ సాగింది.
ఎస్పీని కలిశారు, సీఐ అంజూ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాన్ని అందించారు జనసేన అధినేత. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా షరా మామూలుగానే జనసేన అధినేత వెంట వున్నారు.
వాస్తవానికి, జనసేన నాయకుడిని కొట్టిన పోలీస్ ఉన్నతాధికారి అంజూ యాదవ్ మీద చర్యల దిశగా ఇప్పటికే పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆమెకు మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోపక్క, మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది.
ఎస్పీని కలవడం కంటే, నేరుగా జనసేన నాయకుడి వద్దకు వెళ్ళి.. ఓ చిన్నపాటి బహిరంగ సభని జనసేన అధినేత ప్లాన్ చేసి వుంటే, అది వేరే రకంగా వుండేది. ‘మేం పద్ధతిగా వుంటాం.. మీరూ వ్యవస్థల్ని బాధ్యతగా నడపండి..’ అంటూ చిన్నపాటి హెచ్చరిక వైసీపీ సర్కారుకి మీడియా సాక్షిగా చేసేసి.. ‘మమ’ అనిపించేశారు జనసేన అధినేత.
ఈ మొత్తం వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి.? అంటే, గుండు సున్నా.. అని చెప్పక తప్పదు. జనసేన అధినేత ఆవేశ పూరిత ప్రసంగాల్ని పార్టీ క్యాడర్ ఆశించింది. కానీ, అలాంటివేవీ చేయలేదు జనసేనాని. నిజానికి, అలా చేయడం సబబు కూడా కాదు.
జనసేనాని సంయమనం పాటించారు సరే.. ఆ సంయమనంతోనే ఆయన తిరుపతికి రాకుండా వుండి వుంటే బావుండేదేమో. మంగళగిరిలోనే.. డీజీపీ కార్యాలయంలో.. జనసేన అధినేత, డీజీపీని కలిసి వుంటే.. ఆ ఇంపాక్ట్ ఇంకోలా వుండేది. రాజకీయ నాయకులకి పోలీస్ అధికారులకీ మధ్య గలాటా కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.
అత్యుత్సాహం చూపే అధికారులు.. ఓవరాక్షన్ చేసే రాజకీయ నాయకులు.. ఇదంతా రాజకీయాల్లో మామూలే.