చంద్రబాబు అలా.! పవన్ కళ్యాణ్ ఇలా.!

రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తులున్నప్పుడు.. సంప్రదింపుల్లేకుండా అభ్యర్థుల్ని ఓ పార్టీ ఎలా ప్రకటించేస్తుంది.? నిజానికి టీడీపీ – జనసేన మధ్య ఇంకా పొత్తు కుదరలేదు. చర్చలు ప్రాథమిక దశలోనే వున్నాయి. ఈ కారణంగా, టీడీపీ తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేసుకుంటూ వెళుతోంది.

మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేయాలి.? తన పని తాను చేసుకుపోవాలి కదా.? కనీసం, తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి అయినా ప్రకటన చేయాలి కదా.? ఇదే జనసైనికుల ప్రధాన ఆవేదన.

భీమవరంలో జనసేనాని వారాహి విజయ యాత్ర పూర్తయ్యింది. ఓ వారం రోజుల్లోనే రెండో విడత వారాహి యాత్రను జనసేనాని ప్రారంభిస్తారట. అదీ తూర్పుగోదావరి జిల్లా నుంచేనంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. పోనీ, అప్పుడన్నా అభ్యర్థుల ప్రకటన సాధ్యమవుతుందా.?

‘మేం కలిసి పోటీ చేయడం గురించి ఆలోచిస్తున్నారు.. వాళ్ళేమో ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వెళుతున్నారు..’ అంటూ, జనసేన ఆశావహులు గుస్సా అవుతున్నారు. ‘ఏదో ఒకటి చెప్పేస్తే గ్రౌండ్ లెవల్‌లో పని చేసుకుంటాం కదా.?’ అన్నది జనసైనికుల వాదన. కానీ, అధినేత వారిని కరుణించడంలేదు.

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, టీడీపీ ఎక్కడైతే అభ్యర్థుల్ని ప్రకటించేస్తోందో, అక్కడ జనసేన శ్రేణులు పూర్తిస్థాయిలో చేతులెత్తేస్తున్నాయట. ‘ఇక్కడ ఇక మాకేం పని.?’ అనుకుంటున్నారు ఆయా నియోజకవర్గాల్లో జనసైనికులు.

నెల్లూరుకి సంబంధించి మాజీ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని టీడీపీ ప్రకటించాక.. జనసేన స్థానిక నేతలు తమ అధినాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాయట.