పవన్ కళ్యాణ్.. మీ కామెంట్లు కనీసం మీకైనా అర్థమవుతున్నాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టార్ హీరో అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం స్టార్ హీరో అనిపించుకోలేకపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నేను టీడీపీకి కానీ వైసీపీకి కానీ కొమ్ము కాయనని వెల్లడించారు. ఒక కులానికి గుంపగుత్తగా అమ్మేస్తున్నారంటూ జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్ తో పవన్ టీడీపీతో కానీ వైసీపీతో కానీ కలిసి జనసేన పోటీ చేయదని క్లారిటీ ఇచ్చేశారు.

ఆ తర్వాత పవన్ మాట్లాడుతూ వైసీపీ రాకూడదనేది తమ విధానమని విధ్వంస రాజకీయాలు చేస్తున్న సమయంలో శత్రువులతోనూ కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కామెంట్ తో పవన్ టీడీపీతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2009లో ప్రజారాజ్యం పార్టీని నిలబెట్టుకోలేకపోవడానికి వైఎస్ కుటుంబ కోవర్టులు కారణమని వెల్లడించారు.

2014లో మోదీ కోరిక మేరకు చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు. తిరుపతి పర్యటనలో పవన్ చేసిన కామెంట్లలో ఒక కామెంట్ కు మరో కామెంట్ కు పొంతన లేకపోవడం గమనార్హం. పవన్ మొదట తన రాజకీయాల విషయంలో క్లారిటీతో వ్యవహరించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భిన్నమైన వ్యాఖ్యలు చేయడం వల్ల జనసేనకు నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో కూడా పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చి మోదీ సూచన మేరకే మద్దతు ఇచ్చానని చెప్పవచ్చని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా పవన్ రాజకీయాలు చేయడం సరికాదని అందుకు బదులుగా ప్రజలకు మేలు చేసే విధంగా పవన్ రాజకీయాలు చేస్తే పార్టీకి ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.