మస్ట్ రీడ్: ‘మూర్ఖుడైన మిత్రుడి కన్నా.. తెలివైన శతృువు బెటర్’!

2019 ఎన్నికల అనంతరం తీవ్ర నిరాశలో కొట్టిమిట్టాడారు టీడీపీ నేతలు, జనాలు. అయితే కాలక్రమేణా జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దక్కింది. దీంతో కేడర్ లో కాస్త ఉత్సాహం రాగా.. నాయకుల్లో ఏమూలో ఆశలు చిగురించడం మొదలయ్యాయి. దీంతో మళ్లీ రోడ్లపైకి రావడం మొదలైంది.

ఈ సమయంలో టీడీపీ – జనసేనలు ఓపెన్ అయిపోయాయి. టీడీపీ ప్రత్యక్షంగా మైకుల ముందు చెప్పకపోయినా… ఆ లోటును జనసేనాని భర్తీ చేస్తూ… కలిసే వెళ్తాం అని కన్ ఫాం చేశారు. ఎప్పుడైనా తాను సీఎం అవుతానని చెబితే… నెక్స్ట్ డే టీడీపీ అనుకూల మీడియా పవన్ ని ఇంటర్వ్యూ చేసి, అలాంటి ఆలోచన లేదనే విషయాన్ని రాబట్టి పెద్దగా అచ్చేస్తుంది!

ఫలితంగా జనసైనికులు పిచ్చోళ్లు అవుతారన్న విషయం కాసేపు పక్కనపెడితే… పవన్ ను కాలు నిలకడే కాదు, మాట నిలకడ కూడా ఉండాదన్న మాట అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అయినా కూడా ఇప్పుడు చంద్రబాబుకు ఆప్షన్ లేదు! టీడీపీ, జనసేనలు విడి విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రావడం పక్కా అని.. ఫలితంగా 2019 ఫలితాలు రిపీట్ అయ్యే ప్రమాధం లేకపోలేదని ఆలోచిస్తున్నారని సమాచారం.

సో… కష్టమైనా, నష్టమైనా, ఇబ్బందైనా, కొంతమంది టీడీపీ నేతల త్యాగాలు తప్పనిసరైనా… చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పొత్తులోనే ప్రయాణించాలని ఫిక్సయ్యారని అంటుంటారు. ఈ విషయంలో ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే వారి అనుకూల మీడియా పేపర్ చదవడమో, ఆ ఛానల్ చూడటమో చేస్తే చాలు.. క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ విషయంలో నిన్నటివరకూ ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అవును… వాలంటీర్లపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవరకూ ఒక లెక్క, అంతకు ముందు ఒక లెక్క అన్నట్లుగా ఉంది వ్యవహారం! పవన్ ఇప్పుడు ఎంత కవర్ చేసుకున్నా, ఎంతగా సన్నాయినొక్కులు నొక్కినా… ఇక వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు పొందిన కుటుంబాలు, వృద్ధులూ… ఇలా వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్న వారందరికీ పవన్ శత్రువు అయిపోయారు.

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నట్లుగా… పవన్ నోటి తీట ఫలితం… ఒక్కసారిగా జనసేనపై ఫుల్ నెగిటివ్ ఇంప్రెషన్ ని తెచ్చిపెట్టింది! ఒక్కమాటే కదా అంటే కుదరదు… ఇది సినిమా కాదు.. రీ షూట్ లూ, రీ టేక్ లు ఉండటానికి. ఒక్కసారి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చినతర్వాత ఇక ఫలితం అనుభవించడానికి ప్రిపేర్ అయిపోవడమే!

గతంలో ఒకసారి దళితులపైనా, బీసీ వర్గాలపైనా చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో… అధికార మదంతోనో, అజ్ఞానంతోనో, కళ్లు మూసుకుపోయే కొన్ని కామెంట్లు చేశారు! దళితులుగా పుట్టాలని ఎవరనుకుంటారు అని ఒకరినంటే… తోకలు కత్తిరిస్తా అని మరికోందరిపై దురుసుగా ప్రవర్తించారు. తాను ప్రజాసేవకుడిని అన్న విషయం మరిచి.. ఉత్తర కొరియా కిం అని భావించినట్లున్నారు!

దీంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబు తోక మొత్తం కత్తిరించి పాడేశారు ఏపీ జనాలు! దళితులుగా కాదు… చంద్రబాబులా పుట్టాలని ఎవరూ అనుకోరన్న స్థాయిలో తీర్పు నిచ్చారు!! ఆ ఫలితాలు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకే కాదు.. టీడీపీ మనుగడకు సైతం ముప్పైందన్నా అతిశయోక్తి కాదేమో.

ఇప్పుడు కూడా పవన్ ఒక మాట తూలారు… దీంతో “ఫలితం 2024లో చూద్దువుగాని” అని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల శాపనార్ధాలు తీవ్రమవుతున్నాయి. “నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేసినా, ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా.. 2019 ఫలితాలు రిపీట్ చేసే బాధ్యత తాము తీసుకుంటాం” అని వాలంటీర్లు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. అంటే… ఆ ఎఫెక్ట్ చంద్రబాబు పార్టీకి కూడా పుష్కలంగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట.

ఫలితంగా… జనసేనతో పొత్తు వల్ల లాభపడొచ్చని, పవన్ కు పదో పరకో సీట్లు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సపోర్ట్ తీసుకుని కుర్చీ ఎక్కాలని చంద్రబాబు భావించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ భావన మొత్తం ఒక్కసారిగా పేకమేడలా కూలిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ వల్ల చంద్రబాబుకు వొణగూరే మేలు కంటే… కలిసొచ్చే కీడే ఎక్కువ అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి జనసేన విషయంలో చంద్రబాబు పునరాలోచిస్తారా.. లేక, కలిసి మునిగిపోవడానికి సిద్ధపడతారా అన్నది వేచి చూడాలి!