అన్నవరం కొండపై పవన్ కు కండిషన్స్!

ప్రస్తుతం పూర్తి సమయం రాజకీయాలపై పెట్టినట్లు కనిపిస్తున్న పవన్… రేపటి నుంచి అన్నవరం టు భీమవరం యాత్ర మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చేరుకోనున్నారు. రేపటి నుంచి జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు ఇక్కడ నుంచే అంకురార్పణ చేయనున్నారు.

అయితే ఈ సమయంలో కొండపై ఉన్న నిబంధనలను పవన్ కు గుర్తు చేస్తున్నారు ఆలయ ఈవో. అన్నవరం కొండపై భక్తుల మనోభావాల దృష్ట్యా రాజకీయ సభలు పెట్టడం, ప్రసంగాలు చేయడం, పార్టీ జెండాలు తీసుకురావడం వంటివి పూర్తిగా నిషేధమని ఈవో ఆజాద్ తెలిపారు. ఈ విషయాలు గుర్తుంచుకుని సహకరించాలని జనసేన నేతలను కోరారు.

అయితే జనసేనాని రత్నగిరి కొండపై రాత్రి బస చేయనున్న దృష్టా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ రాత్రి బస చేయనున్న పల్లవి గెస్ట్ హౌస్‌ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం.. రేపు సాయంత్రం కత్తిపూడిలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రత్తిపాడు ఇన్‌ చార్జి వరుపుల తమ్మయ్య బాబు, ఇతర నేతలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా జనసైనికులు అన్నవరం కు భారీ చేరుకుంటున్నారు. ఈ యాత్ర సక్సెస్ పై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని బలంగా నమ్ముతున్న నేతలు.. ఆ మేరకు ఏర్పాట్లు కూడా బలంగా చేస్తున్నారు!

అయితే పవన్ సభల్లో జనసమీకరణ సమస్య ఉండదు కానీ… అవి ఓట్లుగా మారడంలోనే అసలు సమస్య ఉందనేది తెలిసిన విషయమే. గత ఎన్నికల సమయంలో పవన్ ఎదుర్కొన్న సమస్య ఇదే!