ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలవ్వడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి సత్తా చాటాలని, అలాకానిపక్షంలో మనుగడ ప్రశ్నార్ధకం అయిపోద్దని టీడీపీ, జనసేన బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో ఓడిస్తే… ఇక తమకు ప్రతిపక్షం అనే సమస్యే ఉండదని వైసీపీ భావిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో తన సత్తా చాటాలని ఫిక్సయిన పవన్… మరోసారి వారాహి వాహనాన్ని రోడ్డెక్కించనున్నారని తెలుస్తుంది.
అవును… పవన్ కల్యాణ్ వారాహి యాత్రలకు జనసేన కార్యకర్తల్లో ఉన్న క్రేజ్ వేరనే చెప్పాలి. ఆ వాహనానికి, ఆ యాత్రలకు అప్పుడు ఇచ్చిన బిల్డప్, ఫలితంగా వచ్చిన క్రేజ్ ప్రభావం ఇంకా ఉందని అంటుంటారు. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ మరోసారి వారాహి వాహనంపై కనిపించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారని.. ప్రధానంగా జనసేన అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లోనూ యాత్ర బలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో బాబు & కో సూచనల మేరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే కొన్ని కీలక నియోజకవర్గాల్లోనూ పవన్ వారహి యాత్ర ఉండబోతుందని.. అది కూడా ప్రధానంగా జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. టీడీపీకి కంటిమీద కునుకులేకుండా చేశారని చెప్పే వైసీపీ కీలక నేతల నియోజకవర్గాల్లోనూ ఈ వారాహి యాత్ర ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో… ఈ నెల 27వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని వారాహి యాత్రపై ఉండి ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి సభల్లోనూ పవన్ పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ విధంగా ప్రచార పర్వ సమయం ముగిసే వరకూ వరుస యాత్రలతో, వరుస బహిరంగ సభలతో పవన్ బిజీగా ఉండబోతున్నారని తెలుస్తుంది.
కాగా… ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 21 రోజుల పాటు పండుగలు, సెలవు దినాలు అనే తారతమ్యాలు లేకుండా బస్సు యాత్ర చేపట్టనున్నారని తెలుస్తుంది.! సరిగ్గా అదే రోజు నుంచి జనసేన అధినేత పవన్ కూడా వారాహి యాత్ర చేపట్టనున్నారని సమాచారం!!