పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈ రోజు ప్రారంభం కాబోతోంది. ఆదివారం (అక్టోబర్ – 1)న కృష్ణాజిల్లా, అవనిగడ్డలో వారాహి యాత్ర బహిరంగ సభ ఉండబోతోంది. ఈ సందర్భంగా పవన్ చెప్పబోయే మాటలు, చేయబోయే విమర్శలు, చేసే ప్రచారాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. పొత్తు కుదిరిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో రెగ్యులర్ గా ఉండే ఆసక్తి రెట్టింపయ్యిందని అంటున్నారు.
పవన్ కు యాత్ర కొత్త కాదు, సభ కొత్తకాదు, ఆ సభలో ఏపీ ప్రభుత్వంపై అవాకులూ చెవాకులూ అసలే కొత కాదు! ఇదే సమయంలో సభ అనంతరం వైసీపీ నేతల తలంటులూ కొత్తకాదు! కాకపోతే… ఇంతకాలం ఒకలెక్క, ఇకనుంచి ఒక లెక్క అని టీడీపీ నేతలు, టీడీపీతో పొత్తుకు తలొగ్గిన జనసేన నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగబోతోంది టీడీపీతో అధికారికంగా పొత్తులో ఉన్న జనసేన వారాహి సభ!
పవన్ ఈ సభలో ప్రస్థావించే అంశాలు ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ గురించి అనేది తెలిసిన విషయమే. అరెస్ట్ చేసిన విధానం తప్పంటారా.. అసలు అరెస్టే తప్పంటారా.. స్కాం జరిగితే అధికారులది నేరం అంటారా.. లేక, అసలు స్కామే జరగలేదని చెబుతారా.. అదీగాక, ఆధారాలు లేవని టీడీపీ నేతల మాదిరి మాట్లాడతారా అన్నది ఇక్కడ అసలు పాయింట్! మరి పవన్ ఏమి మాట్లడతారు.. ఏమని స్పందిస్తారు అనేది చూడాలి!
ఇదే సమయంలో ఈ రోజు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా పవన్ స్పందించే అవకాశాలున్నాయని అంటున్నారు. గ్రామాల్లో ప్రాథమిక వైద్యశాలలు అభివృద్ధి చేసి, అందులో ఇద్దరు వైద్యులను అందుబాటులో ఉంచి ప్రైవేటు ఆసుపత్రుల గొంతు కోస్తున్నారని అంటారా.. లేక, మరేమైనా కేంద్ర నిఘావర్గాల సమాచారంతో కొత్త విమర్శ చేస్తారా అన్నది మరో ఆసక్తికర విషయంగా ఉంది.
పనిలో పనిగా పోలవరం, అమరావతి, విశాఖ రాజధాని, ఈ నెల 23న జగన్ వైజాగ్ షిప్టింగ్ మొదలైన అంశాలపై చెదురుమదురుగా స్పందించే అవకాశం లేకపోలేదు. అంతకంటే ముందు… టీడీపీతో జనసేన అధికారికంగా జతకట్టడానికి జగన్ కారణం అని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట చెప్పిన పవన్… అందుకు జన్సైనికులను, ఆ పార్టీ నేతలను, కాపు సామాజికవర్గ ప్రజానికాన్ని ఎలా ఒప్పిస్తారనేది మరింత ఆసక్తికలిగించే అంశం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక టీడీపీ – జనసేన కలయిక చారిత్రక అవసరం అని చెప్పడానికి ఏమాత్రం వెనకడుగు వేయని పవన్… బీజేపీపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగించే అంశం. “ప్రస్తుతం” బీజేపీతో పొత్తులో ఉన్నాం.. టీడీపీతో ఎన్నికల్లో పోటీ చేస్తాం.. బీజేపీ కలిసొస్తుందని నమ్ముతున్నాం.. అని చెప్పిన పవన్… బాబు అరెస్ట్ వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందని స్వయంగా టీడీపీ సీనియర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారు.. అసలు స్పందించే సాహసం చేస్తారా అనేది మరో కీలక అంశం అని అంటున్నారు.
మరోపక్క తాజాగా తిరుపతిలో మాట్లాడిన ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు మాట్లడుతూ… జనసేన బీజేపీతో పొత్తులో ఉందని చెబుతున్నారు. పవన్ కు మాతో పెళ్లైందని బీజేపీ చెబుతుంటే… నేను మాత్రం టీడీపీతోనే కలిసి ఉంటాను అని పవన్ చెబుతుంటే… ఈ రాజకీయం, పొత్తుల బంధం ఎలా కడతేరతాదనేది వేచి చూడాలి!
ఏది ఏమైనా… ఈ రోజు వారాహి సభ చాలా ప్రత్యేకమైనదే. మరి ఈ ప్రత్యేకమైన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం కూడా ప్రత్యేకంగానే ఉంటుందా.. నిర్మాణాత్మకంగా సాగుతుందా.. లేక, రొటీన్ రొట్టకొట్టుడేనా అనేది వేచి చూడాలి!