ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే నిజమవుతుంటే… అంటూ పాటపాడుకుంటున్నారు జనసైనికులు. రాష్ట్రమంతా అనుకున్నా.. అతి తక్కువ ప్రాంతమే కవరవుతున్న వేళ.. “ఎంతచెట్టుకి అంత గాలి – గుడ్డికన్నా మెళ్ల బెటర్ కదా” వంటి సామెతలను తలచుకుని కొత్త జోష్ లో ఉన్నారు. అయితే… ఈ సందర్భంగా ఒక కొత్త డౌట్ ను తెరపైకి తెస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మొత్తానికి వారాహి రధంలో జనంలోకి వచ్చేస్తున్నారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించినట్లుగానే పవన్.. జూన్ నెలలో జనంలోకి రానున్నారు. జూన్ నుంచి వారాహి రధమెక్కి ప్రజల కోసం వస్తున్నారు. జనసైనికులు ఎంతో ఆశగా చూసిన పవన్ వారాహి యాత్ర జూన్ 14 నుంచి స్టార్ట్ కాబోతోంది.
అవును… జూన్ 14న ఉదయం అన్నవరంలో వారాహి రధానికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం పవన్ యాత్ర మొదలవుతుంది. వారాహి రధం మీద నుంచి పవన్ తొలి ప్రసంగం కత్తిపూడి జంక్షన్ లో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అన్నవరంలో ప్రారంభమైన ఈ యాత్ర ఎక్కడా విరామం లేకుండా భీమవరం దకా కొనసాగనుంది అని అంటున్నారు.
కాలినడక కాకుండా వాహనంపై యాత్రే కాబట్టి ప్రతీ నియోజకవర్గంలోనూ వీలైనంత ఎక్కువ ప్రాంతాన్ని పవన్ కవర్ చేస్తారని చెబుతున్నారు. ఇలా మొదలవ్వబోతున్న తొలి విడత టూర్ లో మొత్తం పదకొండు నియోజకవర్గాలను పవన్ కవర్ చేస్తారు అని అంటున్నారు.
అంటే… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు… అనంతరం పశ్చిమగోదావరి జిల్లాల్లో… నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందన్న మాట.
ఈ టూర్ ముగిసిన అనంతరం పవన్ కాస్త గ్యాప్ తీసుకుంటారని తెలుస్తుంది. ఆ గ్యాప్ లో సినిమా షూటింగులకు కొంత సమయాన్ని వెచ్చించిన అనంతరం… ఆగస్టులో రెండో విడత యాత్ర ఉండొచ్చని అంటున్నారు.
ఇక పవన్ యాత్ర ఆధ్యాంతం జగన్ సర్కార్ మీద నిప్పుల వర్షాలు కురిపించే దిశలోనే సాగుతుందనేది తెలిసిన విషయమే. వైసీపీ పాలన ఏపీలో ఎందుకు ఉండకూడదో జనాలకు వివరించే ప్రయత్నం చేయబోతున్న పవన్… చంద్రబాబు వస్తే ఏపీ ఎంతలా అభివృద్ధి చెందుతుందో చెబుతూ ప్రజలను ఒప్పించ బోతున్నారు!
దీంతో అన్నవరం టు భీమవరం యాత్ర వేరే లెవెల్లోనే ఉండబోతుంది కానీ… ఆ యాత్ర అవిరామంగా రాష్ట్రమంతా కొనసాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కాలినడకన తిరిగే లోకేషే అవిరామంగా తిరుగుతున్నప్పుడు… వాహనంపై తిరిగే పవన్ కు విరామం ఎందుకని… ఇలాంటి పనులవళ్లే పార్ట్ టైం పొలిటీషియన్ అనే ట్యాగ్ తగిలించుకున్నారని అంటున్నారు!