జనసేన అధినేత పవన్ కల్యాణ గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్నారు. కరోనా అని ఆరు నెలలు హైదరాబాద్ కే పరిమితమైన ఆయన ఇప్పుడు సినిమాలంటూ ఇంకొన్ని నెలలు ప్రజా జీవనానికి దూరంగా ఉండనున్నారు. అయితే పవన్ దూరంగా ఉన్నారనేమాటే కానీ చేయాల్సిన కార్యాలు తన బృందంతో చక్కబెడుతున్నారట. ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను ఇటీవల వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామూలుగా అయితే ఇలాంటివి జరిగితే పవన్ మౌనంగా ఉండరు. బాధితుల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకుని ప్రభుత్వ ముందు పలు డిమాండ్లు ఉంచుతారు.
కానీ ఇప్పుడు సినిమా షూటింగ్లు ఉండటంతో పర్యటనలకు తన బృందాలను పంపుతున్నారట. హైదరాబాద్ సహా వరద ముంచెత్తిన గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, అనంతపురంలలో జనసేన నేతలు పర్యటించి పూర్తి నివేదికను తయారుచేస్తారట. ఆ నివేదికను పట్టుకుని పవన్ ఢిల్లీ వెళ్తారట. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షాలను కలిసి నివేదికను సమర్పించి అందాల్సిన సాయం గురించి ఆరాతీస్తారట. అంతేకాదు ఏపీలో బీజేపీ, జనసేనల పొత్తు విషయమై కీలక చర్చలు జరిపి ఎలా ముందుకువెళితే బాగుంటుందనే విషయంపై పూర్తి స్పష్టత తీసుకుంటారట.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీకి దిగే విషయంలో ఎన్ని స్థానాల్లో కూటమిగా పోటీ చేయాలి, తమకు విడిగా ఎన్ని కేటాయిస్తారు లాంటి అంశాల మీద కూడ పవన్ చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆంధ్రాలో ఎలా ముందుకెళ్లాలనే మీమాంస మీద క్లారిటీ వస్తుందనే ఆశతో ఉన్నాయి జనసేన శ్రేణులు. ఇన్ని నెలలు మౌనంగా ఉన్న పవన్ ఇలా ఉన్నట్టుండి ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పార్టీలో కదలికను తీసుకొచ్చింది. మరి నిజంగానే పవన్ ఢిల్లీకి వెళతారా, బీజేపీ పెద్దల్ని కలుస్తారా, కలిస్తే ఏం కబురు మోసుకొస్తారు అనేది చూడాలి.