Senatho Senani: విశాఖలో జనసేన భారీ కార్యక్రమం: ‘సేనతో సేనాని’

జనసేన పార్టీ విశాఖపట్నం వేదికగా ‘సేనతో సేనాని’ పేరిట మూడు రోజుల భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆగస్టు 28, 29, 30 తేదీలలో జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను, పోస్టర్‌ను ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రభుత్వ బాధ్యతల కారణంగా పార్టీ శ్రేణులతో గడిపేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తగినంత సమయం దొరకలేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

మూడు రోజుల కార్యక్రమ వివరాలు:
ఆగస్టు 28 (మొదటి రోజు): ఈ రోజున జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతాయి. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వంలో జనసేన పాత్రపై చర్చిస్తారు.

ఆగస్టు 29 (రెండవ రోజు): ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఉంటాయి. ఇందులో పర్యావరణం, మహిళా భద్రత, రక్షిత మంచినీటి పథకం, యువతకు ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపై చర్చిస్తారు.

ఆగస్టు 30 (మూడవ రోజు): కార్యక్రమం ముగింపు రోజున విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ‘జనసేన మహాసభ’ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ సభలో సాయంత్రం 6 గంటలకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రతి కార్యకర్తను బాధ్యతతో ముందుకు నడిపించాలనేదే జనసేన పార్టీ ఆలోచన అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జన సైనికులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.

Amaravati Public Reaction On Heavy Rains || Ap Public Talk || Chandrababu || YsJagan || TeluguRajyam