జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ గాజువాక నుంచే పోటీ చేస్తారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది.

అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గాజువాక నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకోసారి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగానే ఈ విషయమై దాదాపుగా పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చేశారట కూడా.

2019 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులేయలేకపోయామనీ, 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కుంభస్థలం కొట్టాలనీ జనసేన అధినేత అనుకుంటున్నారట. విశాఖ నుంచి పోటీ చేసి గెలిస్తే, మూడు రాజధానుల నాటకానికీ ముగింపు పడుతుందన్నది జనసేన అధినేత వ్యూహంగా కనిపిస్తోంది.

మరి, ‘భీమవరం నియోజకవర్గాన్ని వదిలేశారు..’ అన్న విమర్శ వస్తేనో.? ఈ విషయమై జనసేన పార్టీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయ్. నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేయకపోవచ్చు ఈసారి. పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగానూ పార్టీలో చర్చ జరుగుతోందట. అలా చేస్తే, భీమవరం వదిలేశారన్న విమర్శ రాకుండా వుంటుందనేది జనసేన వ్యూహమట.

గతంలోనే గాజువాకలో జనసేనాని ఓడిపోయారు. ఇప్పుడేమో ఏకంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సెంటిమెంట్ పెరుగుతోందాయె. ఈ క్రమంలో జనసేనాని గెలుపు అంత ఈజీ కాదన్నది కొందరి వాదన.

ఎవరేమనుకున్నా జనసేనా మాత్రం ఒకింత పట్టుదలగా వున్నారనీ, విశాఖలో మకాం వేసే దిశగా అక్కడ ఓ ఇల్లు కూడా తీసుకోవాలని జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నారట.