జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అందులో ఒకటి గాజువాక నియోజకవర్గం కాగా, ఇంకొకటి భీమవరం నియోజకవర్గం.
2024 ఎన్నికల్లో జనసేనాని తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భీమవరం నుంచీ పోటీ చేసే అవకాశాలైతే దాదాపుగా లేనట్టే. తూర్పుగోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంపై జనసేన పార్టీ ఒకింత ప్రత్యక శ్రద్ధ పెట్టిందట.. జనసేనాని పోటీ చేస్తారనే ఆలోచనతో.
అయితే, జనసేనాని మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. అదే గాజువాక నియోజకవర్గమట. విశాఖ స్టీలు ప్లాంటు వ్యవహారం, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశం.. ఇలా పలు కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని గాజువాకపైనే జనసేనాని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
మరోపక్క, జనసేనాని తిరుపతి నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తోంది జనసేన శ్రేణుల నుంచి. అదే సమయంలో, తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పోటీ చేస్తే.. ఆ ఇంపాక్ట్ ఈసారి చాలా గట్టిగా వుంటుందని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం వున్నందున, ఇప్పటికిప్పుడు తాను పోటీ చసే నియోజకవర్గం విషయమై గందరగోళం అవసరం లేదని, ఇటీవల తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పారట. మరోపక్క, జనసేన నేత నాగబాబు, తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం విషయమై ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచన కూడా వున్నా, ఆయన లోక్ సభకే పోటీ చేయాలని పట్టుదలగా వున్నారట.
‘నేను పోటీ చేయకపోవచ్చు..’ అని కొన్నాళ్ళ క్రితం నాగబాబు ప్రకటించినా, ఆయన ఇటీవల మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.