టీడీపీ – జనసేన పొత్తు… పునరాలోచనలో పవన్?

ఏమాత్రం సిన్సియారిటీ లేని రీతిలో పాలిటిక్స్ ని తనదైన రీతిలో సీరియస్ గా చేస్తుంటారని పవన్ కు పొలిటికల్ సర్కిల్స్ లో పేరుంది. ఏ కామెంట్ ఎందుకు చేస్తారో.. ఆ కామెంట్ లు పూర్తి భిన్నమైన స్టేట్ మెంట్ తర్వాత ఎందుకు ఇస్తారో.. తాను ఏ సినిమా చూపించినా జనం చూస్తారనే భ్రమలు రాజకీయాల్లో ఎందుకు తీసుకొస్తున్నారో.. ఫలితంగా రాజకీయాల్లో పరిపూర్ణమైన అస్పష్టతతో కన్ ఫ్యూజ్డ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో అర్ధంకావడం లేదని అంటుంటారు పరిశీలకులు.

ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాకత్ అవ్వగానే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటించేశారు. జైలు బయట ప్రకటించిన ఈ పొత్తులో… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పుకొచ్చారు. అనంతరం.. త్వరలో ఉమ్మడి కార్యచరణ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించి నెల రోజులు అయినా కూడా ఇంకా ఆ చప్పుడూ లేదు.

ఈ సమయంలో… జ‌న‌సేన త‌రపున స‌మ‌న్వయ క‌మిటీ నియామ‌కం జ‌రిగిన చాలా రోజుల త‌ర్వాత టీడీపీ స‌మ‌న్వయ క‌మిటీని నియ‌మించింది. ఇదే సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కంటే ముందుగానే ప‌వ‌న్ వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో జ‌రిగింది. ఈ వారాహి విజ‌య‌యాత్రకు టీడీపీ కూడా క‌లిసొచ్చింది. ప‌వ‌న్ మీటింగ్‌ లలో టీడీపీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

దీంతో… ఇక‌పై అన్ని కార్యక్రమాలు రెండు పార్టీలు క‌లిసే చేస్తాయని ఆయా పార్టీల ముఖ్యనేత‌లు తెలిపారు. కానీ చంద్రబాబు అరెస్టుల నేపథ్యంలో కొంత‌కాలంగా టీడీపీ నేతలు చేస్తున్న నిర‌స‌న‌ల్లో, ఆ పార్టీ పిలుపునిచ్చే వీకెండ్ వినూత్న కార్యక్రమాలైన మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు పేర్లతో వ‌రుస‌గా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా జ‌న‌సేన నేత‌లు క‌నిపిస్తున్నట్లు లేదు. దీంతో ఈ పొత్తు వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

అయితే… టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం జనసేన నేతలు వరుసగా చేస్తున్న రాజినామా… జనసైనికుల నుంచి వస్తోన్న విమర్శలు, అలకల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడ్డారని, అందుకే ఉమ్మడి కార్యచరణ అంటే సైడ్ అయిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క తాను ఎన్నో ఇబ్బందులు పడి ఎన్డీయే నుంచి బయటకు వచ్చాను అని చేసిన కామెంట్లపై కూడా పవన్ కి బీజేపీ నుంచి కాల్స్ వచ్చాయనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వైరల్ గా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ సానుభూతి తనకు కూడా ఉపయోగపడుతుందని.. ఫలితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్లొచ్చని పవన్ భావించినప్పటికీ… అవి అంత సానుకూలంగా లేనట్లు కనిపిస్తుందని, బాబు అరెస్ట్ అనంతరం అనుకున్న స్థాయిలో సానుభూతి రాలేదని.. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారని మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి ఈ పొత్తులపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.

కాగా… టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది, పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. జనసేనకు గుడ్‌ బై చెప్పారు.