టిడిపి ఎమ్మెల్యే చింతమనేనిపై ఎన్ని కేసులున్నాయో తెలిస్తే షాక్ అవుతారు

దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తీరును దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆల్ ఇండియా దళిత హక్కుల నేతలు, హమాలీలతో సమావేశమయ్యారు. ఈ సభలో మాట్లాడిన పవన్ టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

శాంతి భద్రతలను రక్షిస్తారనే టిడిపికి మద్దతిచ్చాను అన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం దోపిడీదారులకు కొమ్ము కాస్తోంది. ఎమ్మెల్యే ప్రభాకర్ పై ఎన్నో కేసులున్నా చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే చింతమనేనిని క్రమశిక్షణలో పెడతారా? లేదంటే ప్రజల్నే నిర్ణయం తీసుకోమంటారా అని ప్రశ్నించారు.

చింతమనేని ప్రభాకర్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. ప్రభుత్వ అధికారులను కొట్టడం, పోలీసులను తుపాకీలతో బెదిరించడం, తాజాగా ఏలూరు లిక్కర్ డిపోలో మాట వినలేదని దళిత కార్మికుడిని కులం పేరుతో దూషించి, దాయాది చేయడం చూస్తుంటే ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది అన్నారు.

శాంతి భద్రతలు విభాగాన్ని బలోపేతం చేసి అధికారులను సక్రమంగా పని చేయిస్తారని, సామాన్యులకి భద్రతతో కూడిన పాలన అందిస్తారని నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపానన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు చూస్తుంటే చింతమనేని వ్యవహారశైలి, తీరు రౌడీ షీటర్ ను తలపిస్తున్నాయన్నారు. 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఆయనపై ఇది 38 వ కేసు అన్నారు. మనది ప్రజాస్వామ్యం అని మర్చిపోయి, ఆయన రాచరికంలా నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవైపు ముఖ్యమంత్రి దళిత తేజం అంటూ ప్రచారం చేస్తుంటే… మరోవైపు వారి ఎమ్మెల్యేలు కులాల పేరుతో దూషించి, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన చింతమనేనిపై ఎస్సి, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. సీఎం తన ఎమ్మెల్యేను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సిన రోజులు వస్తాయని హెచ్చరించారు. “మీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా..? లేక ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా..?” అంటూ ముఖ్యమంత్రిని చంద్రబాబునాయుడిని నిలదీశారు పవన్ కళ్యాణ్.