వేల్స్ యూనివర్సిటీ నుంచి సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి గౌరవ డాక్టరేటుని ప్రకటించారు. యూనివర్సిటీలో కాన్వొకేషన్‌కి హాజరై, విలువైన సందేశం ఇవ్వాలంటూ సదరు యూనివర్సిటీ నుంచి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం అందింది.
సినీ నటులకు గౌరవ డాక్టరేట్లు కొత్త విషయం కాదు. ‘కొనుక్కుంటే డాక్టరేట్లు ఏంటి.? పద్మ పురస్కారాలు కూడా దొరుకుతాయ్ మార్కెట్లో..’ అన్న విమర్శ వుండనే వుంది. ఇది కేవలం సినీ ప్రముఖులకే కాదు, రాజకీయ నాయకులకీ, ఇతరులకీ వర్తిస్తుంది. అవార్డులు, డాక్టరేట్ల స్థాయి అలా పడిపోయింది.
పేరూ ఊరూ లేని యూనివర్సిటీలు చాలా ‘గౌరవ డాక్టరేట్లను’ చాలామంది అ‘ప్రముఖులకు’ అందజేయడం చూశాం. ‘డాక్టర్’ అనే ప్రస్తావన పేరు ముందు చూసుకుని మురిసిపోయేవారు, డబ్బు వెదజల్లి గౌరవ డాక్టరేట్లను కొనుక్కుంటుంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తే డాక్టరేట్లు ఇచ్చేసే పనికిమాలిన యూనివర్సిటీలు చాలానే వున్నాయంటారు చాలామంది.
వేల్స్ యూనివర్సిటీ ప్రముఖమైనదేనా.? అన్నది వేరే చర్చ. పవన్ కళ్యాణ్‌తోపాటు పలువురు ప్రముఖులకు ఈ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను అందించనుంది. అయితే, తనను గౌరవ డాక్టరేటుతో సత్కరించాలనుకుంటోన్న వేల్స్ యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
అయితే, ఎంతోమంది చాలా కష్టపడి గౌరవ డాక్టరేట్లు సంపాదిస్తుంటాననీ, అలాంటి గౌరవ డాక్టరేట్ తీసుకునే విషయమై తనకంటూ కొన్ని ఆలోచనలున్నాయనీ, ఈ క్రమంలో ఆ గౌరవాన్ని తాను తీసుకోలేననీ పేర్కొంటూ, యూనివర్సిటీకి లేఖ రాశారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న తాను, ఎన్నికల వ్యవహారాల వల్ల క్షణం తీరిక లేకుండా వున్నాననీ, అందుకే సంబంధిత కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాననీ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కొనేసుకుని గౌరవ డాక్టరేట్ల స్థాయిని తగ్గించేశారు చాలామంది.
కానీ, తిరస్కరించి ఆ గౌరవ డాక్టరేట్ స్థాయిని పెంచిన పవన్ కళ్యాణ్.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదో పబ్లిసిటీ స్టంటు మరి.!