అది టీడీపీకి జనసేనకూ ఉన్న స్పష్టమైన తేడా?

ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ చతురత ముందు, టీడీపీ కార్యకర్తలకున్న పొలిటికల్ నాలెడ్జ్ ముందూ.. అటు పవన్ కల్యాణ్ అయినా, ఇటు జనసైనికులైనా ఆఫ్ట్రాల్ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు వారు చూపిస్తున్న ఉదాహరణలు కూడా అర్ధవంతంగా ఉండటంతోపాటు.. జనసైనికుల అజ్ఞానాన్ని, తుత్తరని తేటతెల్లం చేస్తున్నాయి! దీంతో… ఆ విషయంలో టీడీపీకి జనసేనకూ ఎంత తేడా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఆఫ్టర్ టూ మంథ్స్… సేనాని ఈజ్ బ్యాక్ అనేరేంజ్ లో… సుమారు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. అకాశ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంట‌ల‌ను ప‌రిశీలించ‌డంతో.. పాటు నష్టపోయిన రైతుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ రాజ‌మండ్రి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా… ప‌వ‌న్‌ కు సినిమా అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ స్వాగ‌తం ప‌లికారు. ఇక అక్కడి నుంచి పంట పొలాల‌ను ప‌రిశీలించేందుకు ఆయ‌న భారీ కాన్వాయ్‌ తో ప్రజలకు అభివాదం చేసుకుంటూ బ‌య‌ల్దేరారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… చాలా రోజుల తర్వాత ఏపీకి వచ్చిన పవన్ కు ఆహ్వానం పలికినవారిలో జనసైనికులు మాత్రమే కనిపించడం, గ్లాసు గుర్తు జెండాలు మాత్రమే దర్శనమివ్వడం. అవును… పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి పర్యటనలో స్వాగతం పలికేందుకు కానీ, కాన్వాయ్ తో కలిసి వెళ్లేందుకు కానీ, ఆఖరి రైతులతో మాట్లాడుతున్న సమయంలో కానీ… ఒక్క టీడీపీ కార్యకర్త కనిపించలేదు.. పసుపు జెండా దర్శనమివ్వలేదు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా పొత్తుల విషయంలో టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. కాస్త అటూ ఇటూగా త్వరలో ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమయంలో తుత్తర ఆగకో, రాజకీయంగా పరిపక్వత లేకో, అదీగాక పొత్తును బలంగా కోరుకునే విషయాన్ని బహిరంగ పరిచే పనిలో భాగంగానో… క‌ర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్రకు జెండాలట్టుకుని బయలుదేరారు జనసైనికులు.

కానీ… ఆ చర్చలు ముగిసిన అనంతరం, ఇంకా కొనసాగింపుందని నాదేండ్ల వంటి వారు చెప్పిన అనంతరం… ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్ ఏపీకి వచ్చినప్పుడు కనీసం ఒక్క పసుపు జెండా కూడా వెల్ కం చెప్పలేదు. దీంతో… కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలను, టీడీపీ నాయకులను చూసి జనసేన నేతలు, జనసైనికులు చాలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

దున్నపోతు ఈనిందంటే దూడకు కట్టేయండి అన్న చందంగా కాకుండా… పవన్ – చంద్రబాబు కలిసిన వెంటనే జెండాలెత్తుకుని టీడీపీ సభలకు పోకుండా… కాస్త సంయమనం పాటించాలని, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని, తుత్తర పనులు మానుకోవాలని సూచిస్తున్నారు నెటిజన్లు. అలా కానిపక్షంలో… జనసేనాని లాగానే జనసైనికులు కూడా రాజకీయాల్లో చులకన అయిపోతారాని గుర్తుచేస్తున్నారు. కారణం… పవన్ తో పోలిస్తే జనసైనికులు చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ థింకర్స్ అని విశ్లేషణలు వినిపిస్తుంటాయి!