జనసేనాని పవన్ కళ్యాణ్‌కి అవినీతి మరక.! వైసీపీకి ఎంత లాభం.?

టీడీపీ మీద అవినీతి ఆరోపణలు చేయడం వైసీపీకి మామూలే. ఇప్పుడు కొత్తగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఆరోపణల పర్వం షురూ అయ్యింది. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి భూమిని చంద్రబాబు హయాంలో అప్పనంగా కొట్టేశారన్నది వైసీపీ చాలాకాలంగా చేస్తున్న ఆరోపణ.

అదికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు అవుతున్నా, ఈ వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదు చేయలేదు. ఆధారాలూ చూపించలేదు వైసీపీ నేతలెవరూ. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక అవినీతికి పాల్పడితే (ఆయనేమీ అధికారంలో లేరెప్పుడూ.. దీన్ని అవినీతి అని అనడానికీ వీల్లేదు మరి.!) వైసీపీ సర్కారు వదిలేస్తుందా.? ఛాన్సే లేదు.

తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా 1400 కోట్ల రూపాయల ప్యాకేజీ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ పొందారనీ, హవాలా మార్గంలో విదేశాలకు ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పంపించుకున్నారనీ ఆరోపిస్తున్నారు.

వైసీపీ ఆరోపణలు, హాట్ టాపిక్ అవ్వాల్సింది పోయి, నవ్వులపాలవుతున్నాయి. అంత మొత్తంలో హవాలా అయితే, నాలుగున్నరేళ్ళుగా వైసీపీ సర్కారు ఏం చేస్తోంది.? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతోందా.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయ్యాక అనూహ్యంగా జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగింది. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, వైసీపీకి పాతిక నుంచి 50 సీట్లు అయినా రావడం కష్టమేనని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ – జనసేన పొత్తుని విడదీయడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలూ చేస్తోంది.

ఈ క్రమంలో జనసేనాని మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తోంది వైసీపీ. కానీ, దాని వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదు.!