జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమా వెనుక.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ పాత పాటే పాడారు. వారాంతంలో తెలంగాణలోని హైద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో పొత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ.. ఈ రెండూ రాష్ట్రానికి అవసరం’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ‘కేవలం ప్రజల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జనసేన పార్టీ కలిసి పని చేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు జనసేనాని.

పార్టీ శ్రేణుల మీద ఈ అభిప్రాయాన్ని జనసేనాని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ‘భగవంత్ కేసరి’ సినిమా నేపథ్యంలో టీడీపీ – జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరంగా తిట్టుకోవడం చూస్తున్నాం.

ఇదిలా వుంటే, ‘నేను ఏనాడూ ముఖ్యమంత్రి పదవి వద్దనుకోలేదు. ఎప్పుడూ సుముఖంగానే వున్నాను. ఇప్పుడూ ఆ పదవిని స్వీకరించేందుకు సిద్ధమే. కాకపోతే, పదవి కంటే, ప్రజల తరఫున నిలబడటం అనేది నాకిష్టం..’ అని జనసేనాని చెప్పడం గమనార్హం.

అన్నట్టు, కింది స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ కలిసి పని చేయడానికి అలవాటుపడుతున్న విషయాన్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి తెలియజేశారట.

ఇదిలా వుంటే, ‘ఎటూ చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఆ లెక్కన, టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే వుంటాను..’ అనే భావనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది.

పదే పదే ‘జనసేన – – టీడీపీ ప్రభుత్వం’ అని పవన్ కళ్యాణ్ అంటున్నా, అదే మాట, టీడీపీ నేతల నుంచి కరాకపోవడంపై.. జనసైనికులు గుస్సా అవుతున్నారు.