“రెడీ” సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరో రామ్.. బ్రహ్మానందన్ని వ్యూహాత్మకంగా ఒక ఊహాలోకంలోకి నెట్టేస్తాడు. దీంతో… తాను చెప్పిన పాత్రలన్నీ ప్రాణంపోసుకుని తనకళ్లముందుకు వస్తున్నాయని భ్రమపడుతూ ఉంటాడు. ఆఖరికి.. తనకు ఒక కొత్త ప్రపంచం సృష్టించాలనే ఆలోచన కూడా ఉందని.. తాను అపర బ్రహ్మననే వరకూ వెళ్లిపోతుంది పరిస్థితి!
బయట ప్రపంచానికి తాను మెక్ డోల్ మూర్తి కావొచ్చు కానీ… అంటాడు. తనకి తెలియని మరో ప్రపంచ ఉందని తెలుసుకుని దిగాలైపోతాడు. కట్ చేస్తే… ఇది రామ్ ఆడించిన ఆట అని.. అందులో బలిపశువు అయ్యింది తానే అని తెలుసుకుని .. తాను అపర బ్రహ్మా కాదు, అపరిచితుడూ కాదని తనను తానే కొట్టుకుంటాడు. ఈ ఏపీసోడ్ ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందనేది తెలిసిన విషయమే.
ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… గత ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోయిన బాధను తాజాగా బయటపెట్టుకున్నారు పవన్. తాను పులివెందులలో జగన్ చేతిలో ఓడిపోయినా బాధపడేవాడిని కాదని.. భీమవరంలో ఓడిపోవడం చాలా బాధకలిగించిందని.. గత నాలుగేళ్లుగా దాచుకున్న ఆవేదనను ఒక్కసారిగా బయటపెట్టారు. అంటే… జగన్ పై కాదు, జగన్ నిలబెట్టిన ఒక అభ్యర్థిగా ఓడిపోవడం మరింత అవమానం అని పవన్ ఆవేదన చెందుతున్నారు!!
ఈ సందర్భంగా ఆ బాధను దిగమింగి, తనకు తానే ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశారో ఏమో కానీ… భీమవరంలో తనను గెలిపించి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది చెప్పిన పవన్… “ఎన్నికల్లో గెలవని ఒక నాయకుడు, అసాధ్యం అనుకున్న మూడు పార్టీల కూటమికి ప్రధాన సంధాన కర్తగా మారాడు” అని చెప్పుకున్నారు. అంటే… తాను ఎన్నికల్లో గెలవకపోయినా కూటమిని సృష్టించింది తానే అని చెబుతున్నారన్నమాట!
వాస్తవానికి చంద్రబాబు అనుకోకపోతే ఈ కూటమి జరిగేది కాదు.. చంద్రబాబుని కాదని పవన్ బీజేపీ నేతలను ఒప్పించే అవకాశమే ఉండేది కాదు! కానీ… పవన్ ను అలా ఊహాలోకంలోకి నెట్టేయడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పుకోవాలి! ఏపీలో 2019 ఫలితాల అనంతరం చంద్రబాబుకి కాళ్లూ చేతులూ ఆడలేదనే అనుకోవాలి..! 2024 నాటికి పవన్ తోడు లేకపోతే ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేని పరిస్థితి కూడా అనుకోవచ్చు!
ఇక ఏపీలో టీడీపీ, జనసేనతో కలవకపోతే బీజేపీ పరిస్థితి ఆటలో అరటిపండే! ఈ విషయాలను పవన్ గ్రహించకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డట్లున్నారు! దీంతో… తానే ఈ కూటమికి సృష్టికర్తను అని పవన్ భావిస్తున్నట్లున్నారు.! అదే నిజమైతే… అలాంటప్పుడు సగం సీట్లు అడిగి కూడా తీసుకునే సత్తా పవన్ కి ఉండి ఉండాలి. కనీసం మూడోవంతు తీసుకునే పట్టయినా ఉండాలి.. ఫలితంగా ఫ్యూచర్ లో తన పార్టీ బలపడే దిశగా ఆలోచించినట్లవుతుంది.
కానీ… పవన్ ఆ దిశగా ఆలోచన చేయలేదు! మాటలకు.. ఆ మాటలకు వచ్చే ఈలలకే పూర్తిగా అలవాటైపోయినట్లుగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… మాటలకూ, చేతలకూ చాలా తేడా ఉంటుందనే విషయం ఇప్పటికీ పవన్ కు అర్ధంకాకపోయినా పర్లేదు కానీ… ఆయన వెనుక నడుస్తున్న వారికి కూడా అర్ధం కావడంలేదని అనుకుంటేనే ఇబ్బందే అని అంటున్నారు పరిశీలకులు!