రెండు చోట్లా నేను అందుకే ఓడిపోయా: పవన్‌

మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఫ్యాన్ జోరుకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంటే.. టీడీపీ 23కు పరిమితమయ్యింది. ఇక జనసేన ఒకే ఒక్క సీటును దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వటం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేసాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు జనసేనాని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఓటమిపై సమీక్షలు చేసుకుంటూ.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సందర్బంగా తాను గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోవడంతో ఓటమి ఎదురైనట్టు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీని త్వరలో పునర్నియామకం చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు తెలియజేసేందుకు పక్ష పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన గురువారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పనిచేసేవారందరూ ఒకే తాటిపైకి రావాలని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిని అనుభవంగా తీసుకోవాలని, పార్టీ నేతలు స్వీయ విశ్లేషణ చేసుకోవాలన్నారు.