మళ్లీ మొదటికి: “సీఎం” అని మా వాళ్ల కోసం అన్నాను!

పరిపూర్ణమైన అస్పష్టతతో రాజకీయాలు చేస్తారనే విమర్శను ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్… ఆ విమర్శను మరింత బలపరిచేలా నిత్యం నడుచుకుంటూ ఉంటారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీఎం పోస్టు, పోటీ చేయబోయె సీటు, పొత్తుల ముచ్చట, ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పవన్ మరోసారి మరోరకంగా స్పందించారు.

అవును… తాజాగా అభిమానుల, కార్యకర్తల మనోభావాలతో కూడా ఆడుకుంటూ.. వాటికి ఏమాత్రం విలువ ఇవ్వడు అనే పేరు సంపాదించుకున్న పవన్… తాజాగా మరోసారి అది నిరూపించే పనికి పూనుకున్నారు. “గతకొద్ది రోజులుగా నేనే సీఎం అంటున్నారు” అనే ప్రశ్నపై స్పందించిన ఆయన… “సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలి. సీఎం సీఎం అని మావాళ్లు అదేపనిగా అరుస్తుంటే… నా కేడర్‌ స్టేట్‌ మెంట్‌ ను ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు” అని తేల్చారు.

దీంతో… ఆ పూటకు గడిచిపోవడానికి, ఆ కాసేపు కార్యకర్తలను ఎంటర్ టైన్ చేయడానికి, వారి మనోభావలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా స్పందిస్తున్నారు పవన్ అనే విమర్శలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో తాజాగా ఒంటరిగా పోటీచేస్తానో, పొత్తులో పోటీచేస్తానో తెలియదు అని నాలుగు రోజుల క్రితం చెప్పిన ఆయన తాజాగా… “పొత్తు ఉంటుంది.. ఉండాలి.. కష్టమైనా కలిసే వెళ్తాం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను” అంటూ స్పందించారు.

ఇదే సమయంలో పొత్తుల కోసం చంద్రబాబుని ఇప్పటికే మూడు సార్లు కలిసి చర్చించామని చెప్పిన ఆయన… సీట్ల ప్రస్థావన మాత్రం తాను ఎప్పుడూ తీసుకురాలేదు అని అన్నారు. ఫలితంగా… “బాబు ఎన్ని ఇస్తే అన్ని, కాకపోతే తాను అడిగిన చోట్ల” అనే చర్చను తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో కచ్చితంగా తెలంగాణలో సైతం జనసేన పోటీ చేస్తుందని చెప్పిన పవన్… ఎన్ని సీట్లు, ఎవరితో కలిసి అనే విషయాలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

దీంతో… మరోసారి జనసైనికులను పవన్ వంచించారని.. ఎన్ని యాత్రలు చేసినా, మరెన్ని డైలాగులు వేసినా, ప్రభుత్వంపై ఇంకెన్ని విమర్శలు చేసినా… అవన్నీ చంద్రబాబు కోసమే అనే కామెంట్ కు మరోసారి బలం చేకూర్చారు. సీఎం అవ్వాలంటే అనుభవం ఉండాలి.. ఏదో మావాళ్లు అరుస్తుంటారు కాబట్టి అలా అన్నాను తప్ప.. అని స్పందించడంపై జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!