జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న దరిమిలా, జనసేన అధినేత విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కోసమే జనసేనాని పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపపట్నం వెళ్ళనున్నారట. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో నిర్వహించే రోడ్ షోలో జనసేన అధినేత పాల్గొంటారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో అధికారిక పర్యటన చేయనున్నారనీ, ఈ క్రమంలో జనసేన పార్టీకి సమాచారం వుండకపోవచ్చని బీజేపీ వర్గాలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం భీమవరం వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. అది అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. జనసేన అధినేతకూ ఆహ్వానం అందినా, భీమవరం వెళ్ళలేకపోయారాయన. ఈసారి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్, ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్లే కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ – జనసేన మధ్య పొత్తు విషయమై ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇది మర్యాదక పూర్వక భేటీ తప్ప, ఈ భేటీ వెనుక ప్రత్యేక కారణాలేమీ వుండకపోవచ్చన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. కాగా, ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్న సమయంలోనే ‘జగనన్న మోసం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జనసేన ట్రెండింగ్‌లోకి తీసుకొస్తుండడం గమనార్హం. ప్రధాని పర్యటనకు వైసీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.