జనసేన కవాతు గ్రాండ్ సక్సెస్

మొత్తానికి జనసేన అధినేత తలపెట్టిన ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పవన్ కల్యాణ్, జనసేన ముఖ్యులు ఆశించినట్లుగానే కవాతులో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కాపు సామాజికవర్గం మద్దతుదారులు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతంలో బ్యారేజిపై మొదలైన కవాతు దాదాపు రెండు గంటలపాటు సాగింది.

పవన్ తో పాటు మొన్ననే జనసేనలో  చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కవాతులో భాగంగానే పవన్ తో కలిసి నడిచారు. అయితే కొంతసేపు పవన్ నడవగానే పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కవాతులో భద్రత ఇబ్బందిగా ఉన్న కారణంగా పాదయాత్రలో కాకుండా వాహనంలో ప్రయాణం చేయాలని చెప్పారు. దాంతో కాసేపు వాహనంలో కూడా పవన్ ప్రయాణించారు.

పవన్ రాకకోసం ఉదయమే జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున బ్యారేజి వద్దకు  చేరుకున్నారు. బ్యారేజికి రెండు వైపులా జనసేన జెండాలు, పవన్ కటౌట్లు, పవన్ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బ్యారేజికి రెండు వైపులా గోదావరి నదిలో కూడా స్ధానికులు పడవలను ఏర్పాటు చేశారు. ఆ పడవల్లో కూడా జనసేన బ్యానర్లు, పవన్ కల్యాణ్ కటౌట్లను ఏర్పాటు చేయటం విశేషం.

ఆడ, మగ, చిన్నా,  చితక తేడా లేకుండా పెద్ద ఎత్తున బ్యారేజి మీదకు  చేరుకోవటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. దాంతో బ్యారేజిపైన జనాలు క్రిక్కిరిసిపోయారు. కవాతుతో రాజమండ్రిలోని స్ధానికులకు, స్ధానికులతో జనసైనికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నగరంలోని ట్రాఫిక్ ను  ఇతర ప్రాంతాల నుండి దారి మళ్ళించారు.  దాంతో కవాతు ప్రశాంతంగా జరిగిపోయింది.

బ్యారేజి భద్రత పేరుతో పోలీసులు కవాతును అడ్డుకునే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో అనుకున్నట్లుగానే ధవళేశ్వరం బ్యారేజి కవాతు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.