ఈసారి బలైపోవడానికి సిద్ధంగా లేం.! ఖచ్చితంగా ఈసారి కుంభస్థలం కొట్టి తీరతాం.! కార్యకర్తల త్యాగాలు వృధా పోనివ్వను. అత్యద్భుతమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. జనసేన సత్తా ఏంటో చూపించబోతున్నాం.!
గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు ఇవి. మాటలు చెప్పడానికేం.? పవన్ కళ్యాణ్ చాలానే మాటలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంతవరకు సఫలమవుతున్నాయన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈసారి పవన్ వ్యూహం పదునుగానే వుందనే నమ్మకం ఇప్పుడిప్పుడే జనసైనికులకు కలుగుతోంది.
‘ఒంటరిగానే వెళదాం.. గెలిచినా, ఓడినా గౌరవం వుంటుంది..’ అన్నది చాలామంది జనసైనికుల అభిప్రాయం. అయితే, అది నిన్న మొన్నటి మాట. కానీ, ఇప్పుడు వ్యవహారం మారింది. ఖచ్చితంగా గెలిచే సీట్ల సంగతి ఎక్కువగా వుండాలని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
‘మీరేం చెప్పినా మేం సిద్ధం. కానీ, గెలిచే సీట్ల సంఖ్య ఘనంగా వుండాలి. అంటే, పోటీ చేసే నియోజకవర్గాల ఎంపిక పక్కాగా వుండాలి..’ అని జనసైనికులు, తమ అధినేతకు వివిధ మాధ్యమాల ద్వారా సూచిస్తుండడం గమనార్హం.
జనసేనాని టార్గెట్ 45 నుంచి 55 సీట్లు మాత్రమే.! ఇవన్నీ గెలవాల్సిన సీట్లు. వాటిపై ఇప్పటికే జనసేనాని ఫోకస్ పెట్టారు. 60 నుంచి 75 సీట్ల వరకు జనసేనకు టీడీపీ కేటాయించే అవకాశం వుంది. సంఖ్య కాదు ముఖ్యం, గెలిచే సీట్లు ముఖ్యమని జనసేనాని భావిస్తున్నారు.
ఈ మేరకు పక్కాగా తన లిస్టుని పవన్ కళ్యాణ్ త్వరలో టీడీపీ అధినేతకు అందించేయబోతున్నారట. కానీ, చంద్రబాబు అందుకు సమ్మతిస్తారా.? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, చంద్రబాబుకి వేరే ఆప్షన్ లేదిప్పుడు.