బాబుకు షాకిస్తోన్న పవన్.. సీనియర్ తమ్ముళ్లకు కొత్త టెన్షన్!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో పుత్తుల వ్యవహారంపై అధికారికంగా ఇప్పటికీ తెరపైకి రావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెబుతూనే… ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు అధిష్టాణం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అంటూ ఏపీ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఇదే సమయంలో టీడీపీ – జనసేన పొత్తు పక్కా అని.. పవన్ కల్యాణ్ అక్కడనుంచి బయటపడే ఛాన్స్ లేదని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో పవన్ కూడా ఒంటరిగా వెళ్లే ధైర్యం, బీజేపీతో మాత్రమే కలిసివెళ్లే సాహసం చేయలేరని అంటున్నారు. మరోపక్క టీడీపీతో కలిసివెళ్లే విషయంలో ఏపీ బీజేపీ పెద్దలకు ఆసక్తి ఉన్నప్పటికీ హస్తిన పెద్దలు ఒప్పుకోరని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

పవన్ ను ముందుపెట్టి నడిపించేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారట. అదే కారణమో.. లేక, చంద్రబాబు నాకు సీట్లు ఆఫర్ చేసేదేమిటి.. తనకు నచ్చిన తాను మెచ్చిన సీట్లు తానే తీసుకుంటాననే ఆలోచనో తెలియదు కానీ… గత కొన్ని రోజులుగా చంద్రబాబుకు వరుసగా షాక్ లిస్తూనే ఉన్నారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపికచేస్తున్నారు.

అంతేకాకుండా… ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు హామీ లివ్వడంతోపాటు… ఆన్ లైన్ వేదికగా ఆ సీటు జనసేనదే అని నొక్కి వక్కానిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆయా స్థానాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులు, సీనియర్ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారని అంటున్నారు. పొత్తు లేకపోతే తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు… ఒకవేళ పొత్తు అనివార్యం అయిన నేపథ్యంలో త్యాగాలు తప్పవేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగా… ఆమధ్య పంచకర్ల రమేష్ బాబు పార్టీలో చేరిన సందర్భంలో పెందుర్తి సీటు ఆయనకే అనే సిగ్నల్ పంపించారు పవన్ కల్యాణ్. దీంతో గత మూడు దఫాలుగా వరుసగా పెందుర్తి నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ సీనియర్ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి వర్గం ఆందోళనగా ఉండగా… ఆయన మాత్రం ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు!

ఇదే సమయంలో ఆమంచి స్వాములు చేరిక కూడా ప్రకాశం జిల్లాలో ఓ కీలక నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆ జిల్లాలోని టీడీపీ సీనియర్లు అదే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో గోదావరి జిల్లాల్లో మూడు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను కూడా ప్రకటించి, అక్కడ వారే అభ్యర్థులు అన్నంత సీన్ క్రియేట్ చేశారు జనసేనాని.

ఈ నేపథ్యంలో తాజాగా తెనాలి సీటుని నాదెండ్ల మనోహర్ కి ఖాయం చేస్తూ తీర్మానం చేశారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో జనసేన జెండా ఎగురుతుందని.. నాదెండ్ల మనోహర్ కచ్చితంగా గెలుస్తారని చెప్పారు పవన్ కల్యాణ్. అంటే ఆ సీటు పొత్తుల్లో ఎక్కడికీ పోదని పార్టీ శ్రేణులకు పరోక్షంగా భరోసా ఇచ్చారు పవన్ కల్యాణ్.

దీంతో… తెనాలి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వర్గం ఫైరవుతుండగా… ఆయన మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. దీంతో… పవన్ కల్యాణ్ తెరవెనుక చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా.. లేక, బాబును టెన్షన్ పెట్టడానికి ఇలా చేస్తున్నారా అనేది వేచి చూడాలి!