వైఎస్ జగన్, చంద్రబాబు కంటే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ బెటర్.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.! ఆ పార్టీకి బలమైన క్యాడర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వుండేది. తెలంగాణలో ఇప్పటికీ క్యాడర్ వుంది, నాయకులే లేరు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయానికొస్తే, తెలంగాణలో ఓ ఎంపీ, ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ తరఫున గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక, తెలంగాణలో పార్టీని పూర్తిగా ఎత్తేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.

జగన్, తెలంగాణను వదిలేసినా, జగన్ సోదరి షర్మిల, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ కావొచ్చు.. వైటీపీ కావొచ్చు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది.

టీడీపీ కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి తప్పుకుంది. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, తెలంగాణలో జనసేన పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అదీ భారతీయ జనతా పార్టీ సాయం తీసుకుని.

బీజేపీకి జనసేన ‘సాయం’ అందిస్తోందా.? జనసేనకు బీజేపీ సాయపడుతుందా.? అన్నది వేరే చర్చ. ప్రస్తుతానికైతే రెండు పార్టీలూ కలిసి పని చేస్తున్నాయి. తెలంగాణలో జనసేనకు కొంత మేర టీడీపీ నుంచి కూడా సహకారం లభించొచ్చు.

జనసేన పార్టీ, తెలంగాణలో దాదాపు 32 స్థానాల్లో పోటీ చేయాలనుకుంది. కానీ, 12 స్థానాల దిశగా బీజేపీతో చర్చలు మొదలయ్యాయి. 9 దగ్గర లెక్క కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. కాదు, ఆరు స్థానాలే ఎక్కువని బీజేపీ తెగేసి చెబుతోందిట. ఏమో, పోటీ నాటికి జనసేనకు ఎన్ని మిగులుతాయో తెలియదు. గెలవడం గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు.

కానీ, చంద్రబాబు అలాగే జగన్‌తో పోల్చితే, పవన్ కళ్యాణ్ చాలా బెటర్.!