ఎటూ తేల్చుకోలేకపోతున్న జనసేనాని.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు. ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చంద్రబాబు అరెస్టుతో, రాష్ట్రంలో రాజకీయం అనూహ్యంగా మారుతుందనుకున్నారు జనసేనాని. కానీ, వ్యవహారం తేడా కొట్టేసింది. టీడీపీ గ్రాఫ్ పెరిగినట్టే పెరిగి, పడిపోయింది.

మిత్రపక్షం టీడీపీ ఇలా డీలా పడటం, జనసేన పార్టీకీ కష్టమే. అసలు మిత్ర పక్షం బీజేపీ, ఇప్పుడేమో జనసేనను పట్టించుకోవడంలేదాయె. బీజేపీని కాదని చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జత కట్టడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం కొంత సీరియస్‌గా తీసుకుందిట.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తన బావగారైన చంద్రబాబు మీద రాజకీయంగా అమితమైన ప్రేమ కురిపించేస్తున్నా, బీజేపీ అధినాయకత్వం పట్టించుకోవడంలేదు. దాంతో, పురంధేశ్వరి కూడా కొంత తగ్గాల్సి వచ్చింది.

ఇంకోపక్క, వైసీపీ మైండ్ గేమ్ దెబ్బకి జనసేన విలవిల్లాడుతోంది. సోషల్ మీడియా వేదికగా, జనసేన పార్టీని వైసీపీ సోషల్ మీడియా విభాగం ర్యాగింగ్ చేస్తూ వస్తోంది. ఇంకోపక్క ఒంటరి పోటీ దిశగా జనసేన పార్టీ మీద వైసీపీ ఒత్తిడి పెరుగుతోంది. ఈ గందరగోళం నడుమ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ చిన్న తప్పు చేసినా.. జనసేన పార్టీ ఖేల్ ఖతం అయిపోతుందంతే.

వారాహి యాత్రను అటకెక్కించేశారన్న విమర్శల నేపథ్యంలో, అక్టోబర్ 1 నుంచి మలి విడత వారాహి యాత్ర.. అంటూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదొక్కటీ జనసేన శ్రేణులకు కాస్త ఊరట ఇటీవలి కాలంలో.

వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు.? ఈసారి యాత్రలో టీడీపీ శ్రేణులూ పాల్గొనడం ఖాయమే. అయితే, దాని వల్ల జనసేనకు ఎంత లాభం.? ఏమో, అదైతే వేచి చూడాల్సిందే.