బీజేపీ ఎంటరైతే… పవన్ పోటీచేసేది అక్కడ నుంచే!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. దీంతో రసవత్తర రాజకీయాలకు ఆంధ్ర రాష్ట్రంలో తెరెలేస్తుంది. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికలో జగన్ తలమునకలై ఉన్నారని తెలుస్తుంది. మరోపక్క టీడీపీ కూడా పొత్తు సీట్లను మినహాయించి గెలుపు గుర్రాలను సిద్ధం చేయడానికి కసరత్తులు చేస్తుంది. ఈ సమయంలో వైసీపీ నుంచి వస్తున్న వారివల్ల, కీలక స్థానాలను జనసేనకు ఇవ్వడం వల్ల రెబల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆ సంగతి అలా ఉంటే… పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్ల సంగతి కాసేఫు పక్కనపెడితే… ఆ పార్టీ అధినేత పవ్న ఎక్కడినుంచి పోటీచేస్తారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగలగిరి నుంచి, అచ్చెన్న టెక్కలి నుంచి పోటీచేస్తారనే క్లారిటీ ఉంటుంది కానీ… జనసేన అధినేత విషయంలోనే క్లారిటీ రావడం లేదు. ఈ సమయంలో ఇప్పటికే చర్చకు వచ్చిన నియోజకవర్గం కాకుండా… కొత్త ఇష్యూ తెరపైకి వచ్చింది.

ఒక్కసారి వెనక్కి వెళ్తే… 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ రెండు స్థానాల్లో పోటీచేశారు. అందులో భాగంగా భీమవరం, గాజువాక స్థానాల నుంచి బరిలోకి దిగారు. అయితే రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో… కాపు సామాజికవర్గ ప్రజానికం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి కానీ, బలిజలు ఎక్కువగా ఉన్న తిరుపతి నుంచి కానీ ఈసారి పోటీ చేయాలని భావించారని కథనాలొచ్చాయి.

కారణం… ప్రజారాజ్యం సమయంలో పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసిన చిరంజీవి… పలకొల్లులో ఓడిపోయినప్పటికీ తిరుపతిలో గెలిచారు.. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని పవన్ బలంగా ఫిక్సయిన వేళ… తిరుపతి అయితే సేఫ్ అనే సూచనలు వచ్చాయని అంటున్నారు. అయితే… టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ ఎంటరైతే మాత్రం అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.

పొత్తులో భాగంగా… బీజేపీ తిరుపతిపై పెద్ద ఆశలే పెట్టుకుంది. ఇందులో భాగంగా టెంపుల్ సిటీలో తమ సత్తా చాటాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలొ తిరుపతి ఎంపీ టిక్కెట్ తమకే కావాలని, ఇదే సమయంలో తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ కూడా తమ అభ్యర్థులకే ఇవ్వాలని బీజేపీ కండిషన్ పెట్టిందని చెబుతున్నారని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో… తిరుపతి ఎంపీ అభ్యర్థిగా రత్నప్రభ, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా భానుప్రకాశ్‌ రెడ్డి పేర్లను కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు.

దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ మాటను అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కానీ కాదనలేరని.. అందువల్ల పవన్ మరో ప్లేస్ గురించి ఆలోచన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పవన్ కి ఉత్తరాంధ్ర అయితే సేఫ్ అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో జనసేన నేతలు కూడా శ్రీకాకుళం, విజయనగరం నియోజకవర్గల్లో సేఫ్ జోన్ గురించి సెర్చ్ చేస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి ఈ దఫా పవన్ ఎక్కడినుంచి పోటీచేసినా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. 2019తో పోలిస్తే జనసేనకు ఎంతో కొంత బలం పెరగడంతోపాటు.. టీడీపీ ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తుండటంతో గెలుపు ఈజేనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో అయితే పవన్ కు కాస్త యాడ్ ఆన్ ఉంటుందనే చర్చ మాత్రం జరుగుతుంది.

దీంతో… తాను పోటీచేసే స్థానం గురించి పవన్ అంతలా ఆలోచించనవసరం లేదని.. కాకపోతే వీలైనంత తొందరగా జనాలకు తాను పోటీచేసే స్థానంపై క్లారిటీ ఇవ్వడం ఎంతైనా మంచిదని.. అలా కానిపక్షంలో ఇప్పటికే అక్కడ ఆశలుపెట్టుకున్న టీడీపీ నేతలు రెబల్స్ గా మారితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు పరిశీలకులు.